మీ నమ్మకమే మా బాధ్యత.. గ్రామాభివృద్ధికి అంకితమవుతాం!
13 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ విజయంపై టీ.ఎం. బాబు నాయుడు హర్షం
సోడిగానిపల్లిలో 1,184 ఓట్ల భారీ మెజారిటీతో శాంతమ్మ విజయం.. ఓటర్లకు కృతజ్ఞతలు
గుడిపల్లి మేజర్ న్యూస్:
గుడిపల్లి మండలంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మొత్తం 13 స్థానాలకు పోటీ జరగగా, అన్ని స్థానాల్లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంపై రాష్ట్ర వాల్మీకి సంఘం డైరెక్టర్, మాజీ మండల అధ్యక్షుడు టీ.ఎం. బాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. విజయం సాధించిన 13 మంది ఎంపీటీసీలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యంగా తన సొంత సెగ్మెంట్ సోడిగానిపల్లిలో టీడీపీ అభ్యర్థి శాంతమ్మ విజయం సాధించడం పట్ల ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సోడిగానిపల్లి సెగ్మెంట్‌లో శాంతమ్మకు 1,763 ఓట్లు రాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 579 ఓట్లు వచ్చాయి. దీంతో 1,184 ఓట్ల భారీ మెజారిటీతో శాంతమ్మ విజయం సాధించారు.
ఈ సందర్భంగా బాబు నాయుడు మాట్లాడుతూ.. తనపై, తెలుగుదేశం పార్టీపై నమ్మకంతో అత్యధిక మెజారిటీ అందించిన సోడిగానిపల్లి ఓటర్లందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు అందించిన విజయాన్ని బాధ్యతగా స్వీకరిస్తూ గ్రామాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అదేవిధంగా తన విజయానికి సహకరించి, ఎన్నికల ప్రచారంలో అండగా నిలిచిన టీ.ఎం. బాబు నాయుడుకు శాంతమ్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు.