మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నా.. అద్భుత విజయం సాధించా!
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌గా ఘన విజయం సాధించిన కూటమి అభ్యర్థి పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ బుధవారం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో తనకు అన్ని విధాలా అండగా నిలిచి, విజయానికి సహకరించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వీపీఆర్ దంపతులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎన్నికల్లో 80 వేలకు పైగా భారీ మెజారిటీతో అద్భుత విజయం సాధించిన రూప్ కుమార్ యాదవ్‌ను వేమిరెడ్డి దంపతులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల ఆశీర్వాదంతో అద్భుత విజయాన్ని సాధించానని, తన విజయానికి సహకరించిన కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. వీపీఆర్ దంపతుల మార్గదర్శకత్వంలో నెల్లూరు నగర అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. వేమిరెడ్డి దంపతులు మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన భారీ విజయాన్ని బాధ్యతగా భావించి నగర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. నెల్లూరును ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు.