మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం.. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తాం!
కుప్పిగానిపల్లి ఎంపీటీసీగా మీనాక్షి హేమాంబర్ గౌడ్ ఘన విజయం
2,308 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు.. టీడీపీ శ్రేణుల్లో సంబరాలు
గుడిపల్లి మేజర్ న్యూస్:
గుడిపల్లి మండలంలోని కుప్పిగానిపల్లి ఎంపీటీసీ సెగ్మెంట్‌లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీనాక్షి హేమాంబర్ గౌడ్ 2,308 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆమెకు 2,680 ఓట్లు రాగా, ప్రత్యర్థికి 372 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఈ విజయంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున విజయోత్సవాలు నిర్వహిస్తూ బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా మీనాక్షి హేమాంబర్ గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తన విజయం కోసం అహర్నిశలు శ్రమించిన పార్టీ నాయకులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు, అభిమానులందరికీ ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు సమష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ విజయాన్ని బాధ్యతగా స్వీకరించి ప్రజాసేవకు అంకితమవుతామని మీనాక్షి హేమాంబర్ గౌడ్ స్పష్టం చేశారు.
సూర్య రిపోర్టర్: లెనిన్ బాబు గుడిపల్లి మండలం