మహిళలకు భరోసా - రైతన్నలకు వరం... దత్తి రాజేరులో కస్టమ్ హైరింగ్ సెంటర్ ప్రారంభం
దత్తిరాజేరు, సూర్య : కస్టమ్ హైరింగ్ సెంటర్ లతో మహిళలకు భరోసాతో పాటు రైతన్నలకు వరమని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని దత్తిరాజేరు మండల కేంద్రంలో మంగళవారం కస్టమ్ హైరింగ్ సెంటర్ ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. జిల్లాలో రామభద్రపురం, ఎల్ కోట, గంట్యాడలో కూడా సి.హెచ్.సి సెంటర్లను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళల జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో 1995లో డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసిన మహానీయుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అదే వరవడితో ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకి దక్కుతుందన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడటం ద్వారా కుటుంబ వ్యవస్థ మెరుగుపడుతుందనే నమ్మకాన్ని సృష్టిస్తున్న నాయకుడు కూడా చంద్రబాబు అన్నారు. గ్రామస్థాయి నుంచి మండల సమాఖ్య, జిల్లా సమాఖ్య, రాష్ట్ర కోఆర్డినేటర్ కమిటీలలో మహిళలను ఎంపిక చేస్తూ లీడర్ షిప్ కోసం కార్యాచరణ చేస్తున్నామన్నారు. ఇందుకు గాను కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రతిభ కనబరిచే విధంగా చేయడం కోసం మహిళా పారిశ్రమికవేత్తలను రూపొందించేలా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. మహిళల్లో చైతన్యం తీసుకురావడం కోసం అమరావతి కేంద్రంగా అమ్మవారి పండగ నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి వచ్చే మహిళలు తయారు చేసిన ఉత్పత్తులుతో నేషనల్ సరస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళలు తయారు చేసిన వస్తువులు అమ్మకాల ద్వారా ఆత్మస్థైర్యం నింపటం కోసం సరస్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. సి హెచ్ సి ద్వారా రైతులకు తక్కువ ధరలకు వ్యవసాయ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. సి హెచ్ సి సెంటర్లలో ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, డ్రోను, రోటవేటర్ వంటి పరికరాలు అందుబాటులో ఉంటాయని, రైతన్నలు ఉపయోగించుకోవాలని సూచించారు. సెర్ఫ్ ద్వారా ఎఫ్ పి ఓ, ఐ ఎఫ్ సి యాంకర్లుగా, మహిళా సాధికారత కోసం మహిళలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతి జిల్లాలో నైపుణ్యత కలిగిన 300 మంది మహిళలను ఎంపిక చేసి గ్లోబల్ మార్కెటింగ్ చేయటం కోసం త్వరలోనే శిక్షణ ఇవ్వనున్నామన్నారు. కూటమి ప్రభుత్వ అందిస్తున్న ప్రభుత్వ పథకాలను, అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి చేయూతని అందిస్తున్న ఘనత కూడా కూటమి ప్రభుత్వానిదేనన్నారు. డ్వాక్రా మహిళల అపోహలను తరిమికొట్టేందుకు మన డబ్బులు మన లెక్కలు ప్రత్యేక యాప్ తీసుకురావడం జరిగిందన్నారు. డ్వాక్రా మహిళల కోసం అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని అందులో భాగంగా డిజిటల్ పేమెంట్ యూపీఐ ద్వారా చెల్లింపు సులభతరం చేయడం జరిగిందన్నారు. 20 లక్షలు రుణం పొందిన డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో 32 వేల రూపాయలు రాయితీ కల్పించడం జరిగిందని, ఈ విధానాన్ని దేశంలో మిగతా రాష్ట్రాలు ప్రస్తుతం ఆవలంబిస్తున్నాయన్నారు. సి హెచ్ సి బ్రోచరును ఆవిష్కరించారు. రైతు చూచిక ఉన్న ఎడ్ల బండితో కూడిన జ్ఞాపికను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు సి.హెచ్.సి సభ్యులు బహుకరించారు. సమావేశంలో థాంక్యూ మినిస్టర్ కొండపల్లి అంటూ మహిళలు ప్లక్కార్డులతో ప్రదర్శన చేశారు. కార్యక్రమానికి ముందు సిహెచ్ సి సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి కొండపల్లి పరిశీలించారు. సెంటర్ వద్ద మంత్రి కొండపల్లి ట్రాక్టర్ నడిపి రైతులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చప్పా చంద్రశేఖర్, రామ, డి ఆర్ డి ఎ పి డి శ్రీనివాస్ పాణి, డ్వాక్రా మహిళలు, రైతులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : అప్పలనాయుడు, దత్తిరాజేరు, విజయనగరం జిల్లా.