" మహిళా సాధికారత మాటలకే పరిమితమా… - కాకాణి పూజిత"
చివరి జెడ్పీ సమావేశానికి అధికారులు, ప్రజాప్రతినిధుల గైర్హాజరుపై కాకాణి పూజిత తీవ్ర ఆగ్రహం
ప్రజా ప్రతినిధులకు అధికారులకు, మహిళా ప్రజాప్రతినిదిపట్ల ఉన్న గౌరవం ఇదేనా అని ప్రశ్న
ఐదేళ్లు అద్భుతంగా పాలన అందించిన జెడ్పీ ఛైర్‌పర్సన్ అరుణమ్మ గారి చివరి సమావేశానికి అధికారులు కూడబలుక్కుని గైర్హాజరు కావడం దారుణం
కలెక్టర్ గారు, జెడ్పీ సీఈఓ, అధికారులు రాకపోవడం తీవ్ర బాధాకరం
ఒక్క నిర్ణయంతో స్థానిక సంస్థలపట్ల,మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యం బయటపడింది
స్థానిక సంస్థల్లో 50% మహిళా రిజర్వేషన్ల ఉద్దేశాన్ని దెబ్బతీస్తున్నారు
కూటమి నాయకులు ప్రజలకు, తమ అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులకు ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా?
పబ్లిక్ రిప్రజెంటేటివ్ (ప్రజాప్రతినిధి) ఆనం అరుణమ్మ గారికి కనీస గౌరవం ఇవ్వకపోవడం దురదృష్టకరం
రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేసిన నాయకులను అవమానించడం బాధాకరం
నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ : జెడ్పీ చివరి సమావేశానికి అధికారులు, నేతలు హాజరు కాకపోవడం దారుణం.. స్థానిక సంస్థల ప్రాముఖ్యత మరియు ప్రజాప్రతినిధుల పట్ల కూటమి నాయకులు, అధికారుల వైఖరిని పూజిత గారు తీవ్రంగా తప్పుపట్టారు. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ గారి ఐదేళ్ల పదవీకాలంలో ప్రతి కార్యక్రమాన్ని, సాధారణ సమావేశాన్ని ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తూ వచ్చారని తెలిపారు. ఒక మహిళగా ఎంతో కష్టపడి నెల్లూరు జిల్లా పరిషత్ ను సమర్థవంతంగా నడిపిన అరుణమ్మ గారు , ఐదేళ్ల పదవీకాలంలో చివరి సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కాకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన అరుణమ్మ గారు జెడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఉన్నందున, పార్టీ మారినందు వల్ల మంత్రులు,అధికార పార్టీ నేతలు రాకుండా దూరంగా ఉన్నారనుకున్నా... అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. అయితే, బాధ్యతగల జిల్లా కలెక్టర్ గారు గానీ, జెడ్పీ సీఈఓ గానీ, సంబంధిత ఇతర అధికారులు సమావేశానికి హాజరుకాకపోవడం తీవ్ర బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల పట్ల, ప్రజలు ఎన్నుకున్న ఒక మహిళా ప్రజాప్రతినిధి పట్ల ప్రభుత్వానికి, అధికారులకు ఎంత గౌరవం ఉందో ఈ ఒక్క నిర్ణయంతో స్పష్టంగా అర్థమైపోయిందని కాకాణి పూజిత గారు విమర్శించారు.
ప్రజాప్రతినిధులకు, మహిళలకు గౌరవం ఇవ్వరా?.. జిల్లా పరిషత్ సమావేశం ఉందని స్పష్టంగా పిలుపునిచ్చినా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? ఏమీ ఆలోచించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారా? లేక మహిళే కదా, ఏం చేయగలదు అనే అహంకారంతో ప్రవర్తిస్తున్నారా?" అని ఆమె ప్రశ్నించారు.
ఒక మహిళా ప్రజా ప్రతి నిధి పట్ల ఈ విధంగా ప్రవర్తించిన వారు ప్రజలకు, తమ అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాలని, స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు కల్పించినప్పుడు, వారి ప్రాతినిధ్యానికి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా అని నిలదీశారు. ఇలాంటి పనులు చేసిన తర్వాత రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చి ఓట్లు అడిగే నైతిక హక్కు మీకు ఉందా? కంటెస్ట్ చేయడానికి మీకు నైతికత ఉందా?" అని ఆమె నిలదీశారు.
ప్రజాప్రతినిధి ఆనం అరుణమ్మ గారికి మద్దతు.. ప్రజాప్రతినిధిగా ఉన్న ఆనం అరుణమ్మ గారికి కనీస గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. గతంలో సగం కాలం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ, తమ ప్రభుత్వం లేదని నెపంతో ప్రజల పనులను గాలికి వదిలేయకుండా, నిరంతరం ప్రజల కోసం పని చేసిన నాయకులను ఇలా అవమానించడం తగదని స్పష్టం చేశారు
జిల్లా ప్రథమ మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా?.. ఒక జిల్లా ప్రథమ మహిళకు ఇచ్చే మర్యాద, ప్రాధాన్యత ఇదేనా అని పూజిత గారు ప్రశ్నించారు.సమావేశాల్లో ముందే ఉండి, ఎంతో చక్కగా పనిచేస్తున్న వారిని అభినందించి ప్రోత్సహించాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని ఆమె నిలదీశారు. పనిచేయని వారి గురించి మాట్లాడటంలో అర్థం లేదని, కానీ నిబద్ధతతో పనిచేస్తున్న మహిళా ప్రజాప్రతినిధులు చేసిన అభివృద్ధి పనులను,సేవలను గుర్తించాల్సిన బాధ్యత సంబంధిత వర్గాలకు ఉందని స్పష్టం చేశారు.
మహిళా సాధికారత మాటలకే పరిమితమా.. 33 శాతం రిజర్వేషన్లు, మహిళా సాధికారత అంటూ ఢిల్లీ వరకు వెళ్లి మాట్లాడే నాయకులు, క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే మహిళలను ప్రోత్సహించే ఆలోచన కోల్పోతున్నారని విమర్శించారు. కేవలం తమ ఇంట్లో ఉన్న వారిని లేదా తమ పార్టీలోని కొద్దిమంది మహిళలను ఢిల్లీకి తీసుకెళ్తే సాధికారత వచ్చినట్లు కాదని, స్థానిక సంస్థల్లో ఉండి ప్రజలకు సేవ చేస్తున్న మహిళలకు అసలైన గౌరవం ఇవ్వాలని ఆమె కోరారు. ఏ పార్టీ వారైనా సరే, సమాజానికి మేలు చేస్తూ చక్కగా పనిచేసే వ్యక్తులకు మద్దతుగా నిలవాలని ఆమె పేర్కొన్నారు. బాధ్యత కలిగిన వారు లేకపోయినా, తోటి జెడ్పీటీసీలు, మహిళలు ఆమె చేసిన మంచి పనులను, సమాజానికి అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ ఎంతో చక్కగా మాట్లాడారని ఈ సందర్భంగా తెలియజేశారు.
ప్రజాప్రతినిధులకు మర్యాద ఇవ్వడం నేర్చుకోండి.. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు, స్థానిక సంస్థల నాయకులకు సరైన గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని కాకాణి పూజిత గారు అధికార యంత్రాంగం మరియు ప్రభుత్వానికి హితవు పలికారు. క్షేత్రస్థాయిలో ప్రజల కోసం పనిచేస్తున్న సర్పంచులు, జెడ్పీటీసీలు, జెడ్పీ ఛైర్‌పర్సన్లు తదితర ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తేనే ప్రజలకు సరైన సేవలు అందుతాయని స్పష్టం చేశారు. నాయకులు, అధికారులు తమ అహంకారాన్ని పక్కన పెట్టి ప్రజల సంక్షేమం కోసం ఆలోచించాలని పిలుపునిచ్చారు.
"అధికారం అనేది శాశ్వతం కాదు, కేవలం తాత్కాలికం మాత్రమే. ప్రజలు అనుకుంటే ఒక్క క్షణంలో పక్కన పెట్టేస్తారు" అని ఆమె హెచ్చరించారు. క్షేత్రస్థాయి ప్రతినిధులను గౌరవించకుండా, స్థానిక సంస్థలలో ఇలాంటి క్షమించరాని తప్పులు చేస్తే రాబోయే రోజుల్లో తీవ్ర అపజయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు
అధికార మదంతో మాట్లాడితే ప్రజలు గద్దె దించుతారు.. మహిళా సాధికారతపై మాట్లాడేటప్పుడు ప్రస్తుత సమాజంలో ఉన్న మహిళలను ఆదుకుని, వారికి తగిన ప్రోత్సాహం, మద్దతు ఇవ్వాలని పూజిత స్పష్టం చేశారు. మంత్రి రామనారాయణ రెడ్డి గారు, ఆనం అరుణమ్మ గారిని ఉద్దేశించి సీటు వదలడం ఇష్టం లేక అని చేసిన వ్యాఖ్యలను పూజిత గారు తీవ్రంగా ఖండించారు. "మేము అధికారంలో ఉన్నప్పుడు టిడిపికి చెందిన మహిళా నాయకులను గానీ, మహిళా ప్రతినిధులను గానీ ఎప్పుడూ అవమానకరంగా మాట్లాడలేదు. మహిళలను నిజంగానే ముందుకు ప్రోత్సహించాలనే ఆలోచనతో మేము పనిచేశాం. కానీ, అటువంటి మంచి ఆలోచన మీకు (కూటమి నాయకులకు) లేదు కాబట్టే ఇటువంటి అనాలోచిత వ్యాఖ్యలు, చేస్తున్నారు" అని మండిపడ్డారు.అధికారం చేతిలో ఉంది కదా అని ఏదిమాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనుకోవడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. ప్రజలు ఎల్లప్పుడూ ప్రశాంతమైన వాతావరణాన్ని, సరైన సమన్వయంతో కూడిన పాలననే కోరుకుంటారని పేర్కొన్నారు.పాలకులు అధికారం ఉందని ఏదంటే అది మాట్లాడుతున్నారనేది స్పష్టమైనప్పుడు, ప్రజలు వెంటనే వారిని గద్దె దించే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా పూజిత గారు హెచ్చరించారు.