30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలిపెండింగ్ బకాయిల చెల్లింపునకు రోడ్‌మ్యాప్ విడుదల చేయాలి ఎస్‌టీయూ డిమాండ్
ఉండి, మేజర్ న్యూస్:ఉద్యోగ, ఉపాధ్యాయులకు 30 శాతం మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలని ఎస్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఉండి మండలంలోని వివిధ ఉన్నత పాఠశాలలు, కళాశాలలను సందర్శించిన ఆయన ఉపాధ్యాయులతో విద్యారంగ, ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిటీని నియమించిన నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించేందుకు స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను విడుదల చేయాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేసే దిశగా ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.2003 డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని సాయి శ్రీనివాస్ కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టీయూ ఉండి మండల అధ్యక్షుడు పులిదిండి సత్యం, ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌కుమార్, కె.కిషోర్, ఎస్.సత్యనారాయణ, ఎస్.శేషయ్య, కె.దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
ఈతకోట రాజు ఉండి