లోక కళ్యాణమే లక్ష్యంగా మల్లేశ్వరునికి అభిషేకం
కడియం, మేజర్ న్యూస్ :ప్రకృతి సమతుల్యత, లోకకల్యాణం, సర్వజన సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సకల శ్రేయస్సు కోసం కడియం భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పురాణ ప్రాశస్త్యం కలిగిన ఈ పుణ్యక్షేత్రం వేద మంత్రోచ్ఛారణలతో మార్మోగింది.
ఆలయ పురోహితులు అప్పలి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో వేద పండితులు శాస్త్రోక్తంగా సహస్ర ఘటాభిషేకం, వరుణ జపం, వరుణ హోమం నిర్వహించారు. పవిత్ర జలాలతో స్వామివారికి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తూ లోకకల్యాణం, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు చేశారు.
వేద పండితుల మంత్రోచ్ఛారణలు, శివనామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన పూజా కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తాయి. స్వామివారికి అభిషేకం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో పవిత్ర జలాలతో కూడిన ఘటాలను సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.
సహస్ర ఘటాభిషేకం సందర్భంగా ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగగా, భక్తులు "హర హర మహాదేవ... శంభో శంకర..." అంటూ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఏకాదశి పర్వదినాన నిర్వహించిన ఈ విశేష పూజా కార్యక్రమాలతో ఆలయం భక్తిభావంతో, ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.