కూటమి అభ్యర్థుల విజయం తథ్యం
కూటమి అభ్యర్థుల విజయం తథ్యం
కార్పొరేటర్ల విజయాన్ని సీఎం కు కానుకగా అందిస్తాం
జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి షణ్ముగం
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు బలపరుస్తున్న అభ్యర్థుల విజయం తధ్యమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పి షణ్ముగం స్పష్టం చేశారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖల ప్రక్రియలో భాగంగా చివరి రోజు అయిన ఆదివారం స్థానిక సంతపేటలోని స్వర్ణ గ్రామం వార్డు సచివాలయంలో 52, 53, 54, 55 డివిజన్లకు సంబంధించిన టిడిపి అభ్యర్థులు షణ్ముగంతో కలిసి తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఈ ఈ క్రమంలో 52 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా చంద్రశేఖర్ అలియాస్ చందు, 53 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా షర్మిల, 54 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా రతీదేవి, 55 వ డివిజన్ అభ్యర్థిగా సీఎం విజయ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా తమ నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి విమలకు సమర్పించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, చిత్తూరు కో- ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ షణ్ముగం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు అందిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు టిడిపి అభ్యర్థుల విజయానికి శ్రీరామరక్షగా నిలవడం ఖాయమన్నారు. ఈ నెల 28 వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో సంతపేట పరిధి నుంచి పోటీ చేస్తున్న నలుగురు కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా సమర్పిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకులు నారా లోకేష్, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, బిజెపి నాయకులు మాధవన్ నేతృత్వంలో శరవేగంగా ముందుకు సాగుతున్నాయన్నారు. ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సంక్షేమ, అభివృద్ధి పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్నారని తెలిపారు. గత ఎన్నికల్లో వైకాపా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతటి అరాచకాన్ని సృష్టించిందో ప్రజలకు తెలిసిందేనని, ప్రతిపక్షంలో ఉన్న వైకాపా ప్రజలను ఇబ్బందులు గురి చేసేలా అరాచకాలకు పాల్పడుతోందన్నారు. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో కూటమి పార్టీల అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారని స్పష్టం చేశారు. సంతపేట పరిధిలోని నాలుగు డివిజన్లను బీసీలకు కేటాయించడం పట్ల బీసీ నేతగా హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈశ్వర్ బాబు మాట్లాడుతూ... చిత్తూరు ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కార్పొరేటర్ అభ్యర్థుల ఘన విజయానికి దోహద పడతాయన్నారు. సంతపేట ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ద్వారకనాథ్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.