కేసులు త్వరగా తేల్చండి.. రికార్డులు పక్కాగా ఉంచండి!’
స్టీల్‌ప్లాంట్ పిఎస్ లో సీపీ శంఖబ్రత బాగ్చి తనిఖీ
గాజువాక, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్ : పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందించేలా సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం ఆయన స్టీల్‌ప్లాంట్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిఎస్ పరిసరాలతో పాటు రికార్డులను నిశితంగా పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. స్టేషన్‌కు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు పేరుకుపోకుండా తక్షణమే శుభ్రం చేయించాలని, మరుగుదొడ్లను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు.
ఫిర్యాదుదారులకు అందుబాటులో ఉండేలా స్టేషన్‌లో ఎల్లప్పుడూ తగినంత సిబ్బంది విధుల్లో ఉండాలని స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి కేసులను నాన్చకుండా, పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. స్టేషన్‌కు సంబంధించిన రికార్డులు, అన్ని రిజిస్టర్లను ఎప్పటికప్పుడు పక్కాగా అప్‌డేట్ చేయాలని, విధుల్లో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు.