కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్ గా బుట్నా లక్ష్మి, ప్రమాణ స్వీకారం.
కళ్యాణదుర్గం: పురపాలక సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముఖ్య అతిథిగా, ఎక్స్‌ఆఫీషియో సభ్యుడిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ జి. వసంత బాబు నూతన మున్సిపల్ చైర్మన్‌గా బుట్నా లక్ష్మీ తిమ్మరాజు, వైస్ చైర్మన్‌గా వెంకట కార్తీక్‌తో పాటు కౌన్సిలర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన పాలకవర్గ సభ్యులు తమ బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నూతన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సమస్యల పరిష్కారం, రహదారుల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆకాంక్షించారు. నూతన పాలకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ పట్టణంలోని ప్రతి వార్డులో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా పట్టణ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, నూతన కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారంతో కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు మరింత ఊపునివ్వాలని పట్టణ ప్రజలు ఆశిస్తున్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.