కలుపు మందు తాగిన ఇద్దరు మృతి.
వాసవి పెనుగొండ, సూర్య న్యూస్:పెనుగొండ మండలం కామదేవుని లంక పరిధిలోని పొలాల్లో కలుపు మందు తాగిన ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పెనుగొండ ఎస్సై కొప్పిశెట్టి గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. పెరవలి మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన కొండేటి కిషోర్ (31), గూడూరి తేజశ్రీ గంగా మహాలక్ష్మి (36) గతంలో ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులు వారి వివాహానికి అంగీకరించకపోవడంతో ఇద్దరూ వేర్వేరు వ్యక్తులను వివాహం చేసుకున్నారు.వివాహాల అనంతరం కూడా వారి మధ్య పరిచయం కొనసాగింది. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో వారిని దూరంగా ఉంచినట్లు పోలీసుల వివరాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో అక్టోబర్ 10న ఇంటి నుంచి వెళ్లిపోయిన ఇద్దరూ కామదేవుని లంక పరిధిలోని పొలాల్లో ఉదయం 10.30 గంటల సమయంలో కలుపు మందు తాగారు.సమాచారం అందుకున్న బంధువులు 108 అంబులెన్స్‌లో కిషోర్‌ను తణుకులోని శ్రీకేశవ ఆసుపత్రికి, తేజశ్రీని యాపిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అక్టోబర్ 11న ఉదయం 10.30 గంటలకు కిషోర్, సాయంత్రం 6.30 గంటలకు తేజశ్రీ మృతి చెందినట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు.
రిపోర్టర్ : పి.వెంకట్రామయ్య , పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా