కలెక్టరేట్‌లో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు
సూర్య, నంద్యాల బ్యూరో:మహనీయ విద్యావేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను బుధవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశాల మేరకు, జిల్లా రెవెన్యూ అధికారి సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, ఉర్దూ అకాడమీ, మైనారిటీ సంక్షేమ శాఖ ఉద్యోగులు, వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ తదితరులు పాల్గొని మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ రామునాయక్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ పోషించిన కీలక పాత్రను, స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగ అభివృద్ధికి ఆయన చేసిన విశేష కృషిని స్మరించుకున్నారు. విద్య ద్వారానే సమాజ అభ్యున్నతి, జాతీయ సమైక్యత, సామాజిక సామరస్యం సాధ్యమనే ఆయన ఆశయాలు నేటికీ సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో ఆయన అందించిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*