కార్యకర్తలపై దాడులను సహించేది లేదు!
ఓర్వకల్లు మేజర్ న్యూస్:కార్యకర్తలపై దాడులను ఏమాత్రం సహించేది లేదు. దాడులకు పాల్పడిన వారిపై పోలీసులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి” అని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి హెచ్చరించారు.
ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ రెండు స్థానాల్లో విజయం సాధించడంతో టీడీపీకి చెందిన నాయకులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వరకంటి ఖాదర్ భాష, వరకంటి రఫీ, హౌలా బాకర్, ఉలిందకొండ మాబు, ఉలిందకొండ మహబూబ్ బాషా దాడికి గురైనట్లు తెలిపారు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న కాటసాని రామభూపాల్ రెడ్డి కాల్వ గ్రామానికి చేరుకుని దాడికి గురైన కార్యకర్తలను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయంగా ఎదుర్కోలేక కార్యకర్తలపై దాడులకు పాల్పడటం సరికాదని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని, దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కాల్వ గ్రామ నాయకులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.