కాలు కోల్పోయిన వృద్ధుడికి మంత్రి సుభాష్ అండ
రూ.15 వేల ఆర్థిక సహాయం అందించి ధైర్యం చెప్పిన మంత్రి సుభాష్
రామచంద్రపురం మేజర్ న్యూస్ :డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రూరల్ మండలం వేగాయమ్మపేట (పెయ్యలవారిపేట) గ్రామానికి చెందిన పెయ్యల ముత్యాలు షుగర్ వ్యాధి తీవ్రత కారణంగా కాలు కోల్పోయిన విషయం తెలుసుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మానవత్వం చాటుకున్నారు. బాధిత వృద్ధుడిని పరామర్శించి రూ.15 వేల చెక్కు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కాలు కోల్పోయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని, ధైర్యంగా ఉండాలని పెయ్యల ముత్యాలకు భరోసా కల్పించారు. అవసరమైన సందర్భాల్లో తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ద్వారా సమాజంలో మానవత్వం మరింత బలపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, జనసేన ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్ సలాది రమేష్, రూరల్ మండల టిడిపి అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనుబాబు, క్లస్టర్ ఇంచార్జ్ బొమ్ము బాలకృష్ణ(బాలు), కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.