జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్... *జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి *
విజయనగరం, సూర్య : జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అత్యంత ప్రశాంత వాతావరణంలో ముమ్మరంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,586 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించబడుతుందని ఆయన పేర్కొన్నారు. మధ్యాహ్నం 1:00 గంటల సమయానికి జిల్లాలో 44.4 శాతం పోలింగ్ నమోదైందని, గత ఎన్నికల్లో నమోదైన 65 శాతం ఓటింగ్ కంటే ఈసారి మరింత ఎక్కువ శాతంలో పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా ముందస్తుగానే ప్రతి ఒక్కరికీ ఓటర్ స్లిప్పులను పంపిణీ చేసినట్లు కలెక్టర్ వివరించారు. సాయంత్రం 5:00 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, పోలింగ్ పూర్తయిన వెంటనే బ్యాలెట్ పెట్టెలను భద్రపరిచేందుకు 7 నియోజకవర్గాల్లో 7 స్ట్రాంగ్ రూమ్‌లను సిద్ధం చేశామని తెలిపారు. రాత్రి 9:00 నుండి 9:30 గంటల లోపు అన్ని పోలింగ్ సామాగ్రిని మరియు బ్యాలెట్ బాక్సులను సురక్షితంగా స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చి సీల్ వేసేలా సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
అలాగే ఎల్లుండి ఉదయం 8:00 గంటల నుండి ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 28 మండలాలకు సంబంధించి ఈ 7 కౌంటింగ్ కేంద్రాలలోనే లెక్కింపు ప్రక్రియ చేపడుతున్నామన్నారు. ఓట్ల లెక్కింపు రౌండ్లు మండలాల వారీగా ఉన్న పోలింగ్ కేంద్రాల సంఖ్యపై ఆధారపడి ఉంటాయని, తక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న మండలాల్లో 4 రౌండ్లలోను, ఎక్కువ కేంద్రాలు ఉన్న చోట 8 రౌండ్ల వరకు లెక్కింపు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ తెలియజేశారు.