జీఎంఆర్ ఐటీలో విద్యార్థుల విజ్ఞాన పర్యటన
బాడంగి, సూర్య : విద్యార్థుల్లో సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలపై ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా బాడంగి పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాజాంలోని జీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని సందర్శించారు. ఈ పర్యటనకు సంబంధించి మండల విద్యాశాఖాధికారి జె. రాజేశ్వరి పర్యవేక్షణలో విద్యార్థులను బస్సులో పంపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ ఇంజినీరింగ్ విభాగాలు, ఆధునిక ప్రయోగశాలలు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పొందారు. కళాశాల అధ్యాపకులు పలు సాంకేతిక అంశాలను వివరించారు. ఈ విజ్ఞాన పర్యటన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దత్తి సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కొల్లి ఈశ్వరరావు, రమేష్, గోవింద్, సత్యనారాయణ, రామారావు, దినేష్, వెంకటరమణ పాల్గొన్నారు.