జీబీఆర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా భగవాన్ బిర్సా జయంతి వేడుకలు.
అనపర్తి మేజర్ న్యూస్. భారత యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ తూర్పుగోదావరి జిల్లా విభాగం నిర్వహణలో అనపర్తిలోని జీబీఆర్ డిగ్రీ కళాశాలలో ఆదివారం జనజాతీయ గౌరవ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా 151వ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.1875 నవంబర్ 15న ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్రంలో జన్మించిన బిర్సా ముండా గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేసిన మహనీయుడని వక్తలు కొనియాడారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ గిరిజనుల్లో చైతన్యం నింపిన ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన జయంతిని ఏటా జనజాతీయ గౌరవ దివస్‌గా నిర్వహించడం గిరిజన వీరుల త్యాగాలకు ఇచ్చే సముచిత గౌరవమని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. జీబీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.పి. అబ్బాయిరెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పి.ఆర్.ఎల్. స్వామి, కెమిస్ట్రీ అధ్యాపకులు కె. రామకృష్ణ, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఆనంద్ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జార్ఖండ్ రాష్ట్రానికే కాకుండా యావత్ భారతదేశంలోని గిరిజనుల హక్కులు, అభ్యున్నతి కోసం పోరాడిన గొప్ప నాయకుల్లో బిర్సా ముండా ఒకరని అన్నారు. అటువంటి మహనీయుల జీవిత చరిత్రలు, పోరాట స్ఫూర్తిని నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గిరిజన వీరుల త్యాగాలను భావితరాలకు తెలియజేసేందుకు ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.