జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మహారాజా కళాశాలలో ప్రత్యేక ఉపన్యాసం...
విజయనగరం, సూర్య : మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా విజయనగరంలోని మహారాజా కళాశాల (స్వయంప్రతిపత్తి) విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం కోట లో గల మోతీ మహల్‌లో ఉన్న అభినవ ఆంధ్రభోజ మహారాజా ఆనంద గజపతి రాజు ఆడిటోరియంలో ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో “భారతదేశ పరివర్తనలో విద్యా సంస్కరణల పాత్ర" అనే అంశంపై ప్రముఖ విద్యావేత్త, ప్రొఫెసర్ (రిటైర్డ్) ఎం.ఎస్.ఆర్. శర్మ , రాజమండ్రి, ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం జిల్లా విద్యా శిక్షణా సంస్థ లో సీనియర్ లెక్చరర్‌గా సేవలందిస్తున్న ఆయన విద్యారంగంలో వస్తున్న మార్పులు, నూతన విద్యా విధానం, విద్యా సంస్కరణల ఆవశ్యకత, నాణ్యమైన విద్య ద్వారా దేశాభివృద్ధి సాధించే మార్గాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య అనేది కేవలం ఉద్యోగ సాధనకే పరిమితం కాకుండా, విద్యార్థుల్లో జ్ఞానం, నైపుణ్యాలు, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందించే సాధనంగా ఉండాలని పేర్కొన్నారు. భారతదేశ భవిష్యత్తు నిర్మాణంలో విద్యా సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యావ్యవస్థలో నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా దేశ విద్యారంగ అభివృద్ధికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందించడం ద్వారా సమానత్వం, సామాజిక న్యాయం, జాతీయ సమైక్యత సాధ్యమవుతాయని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు విద్యా సంస్కరణలు, భారతదేశ విద్యారంగ భవిష్యత్తుపై విలువైన అవగాహనను పొందారు. తర్వాత పి పి టి మరియు పోస్టర్ ప్రెసెంటేషన్ లలో గెలుపుందిన విద్యార్థులు కి బహుమతులు అందించారు. మహారాజా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం సాంబశివరావు అధ్యక్షత వహించిన ఈ సదస్సు లో మాన్సాస్ విద్యాసంస్థల కరెస్పాండంట్ డాక్టర్ కె వి ఎల్ రాజు, ఎడ్యుకేషన్ విభాగం విభాగధిపతి డాక్టర్ టి శ్రీదేవి, రమణ, డాక్టర్ భాగ్యలక్ష్మి, శ్రీనివాస్, కన్వీనర్ లు, వివిధ విభాగాల విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.