గ్రామ పంచాయతీ ఫేజ్ 1 పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు* *రైతు బజార్లలో కూరగాయల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలి* *ఈ నెల 27వ తేదీ నాటికి ఏఎస్డీడీ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*
కర్నూలు, నవంబర్ 25:- గ్రామ పంచాయతీ ఫేజ్ 1 పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.
బుధవారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయంలో సర్ ప్రక్రియ, మ్యుటేషన్, 22 ఏ, గ్రామ పంచాయతీ ఫేజ్ 1 ఎన్నికల అంశాల పై కలెక్టర్ సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఫేజ్ 1 పోలింగ్ సమయంలో ఎక్కడైనా సిబ్బంది కొరత ఏర్పడినా, ఏదైనా పోలింగ్ కేంద్రంలో అధిక రద్దీ కారణంగా అదనపు సిబ్బంది అవసరమైనా రిజర్వ్ సిబ్బందిని వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి నాణ్యమైన భోజనం అందించాలని, భోజనం పంపిణీలో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం జరగకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాలకు మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 నుంచి 1 గంటలోపు భోజనం చేరేలా ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. భోజనం ఆలస్యం కావడం వల్ల కౌంటింగ్ ప్రక్రియలో జాప్యం జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నవారు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, ప్రతిరోజూ డయాలసిస్ చేయించుకోవాల్సిన వారు, తదితర తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నవారి పరిస్థితులను పరిశీలించి, నిబంధనల మేరకు విధుల నుంచి మినహాయింపు కల్పించాలని కలెక్టర్ సూచించారు. కౌంటింగ్ ప్రక్రియలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఆలస్యం చేయకుండా ఫలితాలను ప్రకటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రీకౌంటింగ్ కోరినట్లయితే ఎన్నికల నిబంధనల ప్రకారం రీ కౌంటింగ్ నిర్వహించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని, జనరేటర్లను అందుబాటులో ఉంచాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మైక్ సిస్టమ్, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు..
రైతు బజార్లలో కూరగాయల ధరలను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 27వ తేదీ శుక్రవారం నాటికి పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఫారాల పంపిణీ పూర్తయిన వెంటనే వాటి సేకరణ ప్రక్రియను ప్రారంభించాలని, శనివారం, ఆదివారం కూడా సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించుకుని ఫారాల కలెక్షన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.. ఆన్లైన్‌లో కలెక్షన్ ఆప్షన్ అందుబాటులోకి రాకపోయినా, ఫారాలను భౌతికంగా సేకరించి భద్రపరచాలని, ఆన్లైన్ సదుపాయం అందుబాటులోకి వచ్చిన వెంటనే డిజిటలైజేషన్ ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ఏడు రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న ఫారాలు, క్లెయిమ్‌లను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించడంతో పాటు, 15 రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న 22ఏ దరఖాస్తులను మూడు రోజుల్లోగా పరిష్కరించాలన్నారు.
మ్యుటేషన్ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా దరఖాస్తుదారులకు అందించే 1-బి, అడంగల్ తదితర భూ రికార్డుల ప్రతులను పోస్టల్ ద్వారా పంపించేందుకు వీలుగా వారి పూర్తి చిరునామాలను తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు డిజిటల్ అసిస్టెంట్లు, వీఆర్వోలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ ఎంపీడీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు .. మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలోనే దరఖాస్తుదారుల పూర్తి చిరునామా, పోస్టల్ వివరాలను సక్రమంగా నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు..
టెలి కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు, ఆదోని ఆర్డీఓ అరుణ దేవి, జిల్లా పరిషత్ సీఈఓ సుధాకర్ రెడ్డి, డిపిఓ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు