ఘనంగా పోలేరమ్మ జాతర మహోత్సవ గోడ పత్రికల ఆవిష్కరణ
పొదలకూరు, మేజర్ న్యూస్: పొదలకూరు గ్రామ దేవత, శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాలను పురస్కరించుకొని జాతర వాల్ పోస్టర్లను బుధవారం ఆలయ ప్రాంగణంలో జాతర నిర్వహణ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో పోలేరమ్మ జాతర మహోత్సవాలను రంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 6న ఘటోత్సవం, 7న అమ్మవారి ఉత్సవం, 8న నిలుపుదల, నగరోత్సవం–నిష్క్రమణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఘటోత్సవం రోజున సాంప్రదాయబద్ధంగా ఘటాలను ఊరేగించి, సద్ది సేకరించి భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారని తెలిపారు. 7 వ తేదిన నరసారెడ్డి కాలనీ లోని కుమ్మరి ఇంట్లో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి, పోలేరమ్మ మాన్యంలో చాకలి సాంగ్యం నిర్వహించిన అనంతరం అమ్మవారిని ఆలయానికి తీసుకువచ్చే సంప్రదాయం కొనసాగుతుందని వివరించారు.అక్టోబర్ 8 న గురువారం ఉదయం నుంచి భక్తులకు అమ్మవారి దర్శనాలు ప్రారంభమవుతాయని, మధ్యాహ్నం 3 గంటల అనంతరం నగరోత్సవం ప్రారంభమై మనుబోలు రోడ్డులోని పొటేళ్ళ వాగు వద్ద నిష్క్రమణ కార్యక్రమంతో ముగుస్తుందని తెలిపారు. ఆరో తేదీ రాత్రి పాటకచేరి కార్యక్రమం సంస్కృతిక కార్యక్రమాలు పోలేరమ్మ మన్యం వద్ద జరుగుతాయన్నారు.జాతర మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కమిటీ సభ్యులు కోరారు. కార్యక్రమంలో పోలేరమ్మ జాతర నిర్వహణ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.