ఘనంగా కృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం
ఘనంగా 'కృష్ణ మల్టీ స్పెషాలిటీ' ఆసుపత్రి ప్రారంభం.
నంద్యాల టౌన్ మేజర్ న్యూస్( జయ భారత్ రెడ్డి )
నంద్యాల జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా స్థానిక శ్రీనివాస్ నగర్ రైతు బజార్ సమీపంలో 'కృష్ణ మల్టీ స్పెషాలిటీ' ఆసుపత్రి గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ, గైనకాలజిస్ట్ డాక్టర్ తనూజల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు.
అన్ని రకాల హృద్రోగాలకు చికిత్స
ఈ సందర్భంగా డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ తనూజ మాట్లాడుతూ.. గుండె జబ్బులకు సంబంధించిన అన్ని రకాల చికిత్సల కోసం అత్యాధునిక కార్డియాక్ ఐసీయూ, క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేశామన్నారు. యాంజియోగ్రామ్, గుండె బైపాస్ ఆపరేషన్లతో పాటు 'తనూజ ఫెర్టిలిటీ సెంటర్' ద్వారా సంతానలేమి సమస్యలకు, స్త్రీల వ్యాధులకు ప్రత్యేక చికిత్సలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్‌ఎస్, హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తామని తెలిపారు.
సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ఈ ఆసుపత్రి ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని ముఖ్య అతిథి డాక్టర్ రవికృష్ణ ఆకాంక్షించారు. ప్రజలు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.