ఘాట్ రోడ్డులో యథావిధిగా వాహనాల రాకపోకలు
అరకులోయ, నవంబర్ 14, మేజర్ న్యూస్: అరకులోయ ఘాట్ రోడ్డులో భారీ వాహనాలకు యథావిధిగా మార్గం సుగమమైంది.గత మూడు వారాలుగా ఘాట్ రోడ్డులో నిలిచిపోయిన భారీ వాహనాల రాకపోకలు శనివారం నుంచి మళ్లీ మొదలయ్యాయి.21 రోజులపాటు తేలికపాటి వాహనాలు మాత్రమే రాకపోకలు సాగించిన
ఈ మార్గంలో తిరిగి అన్ని రకాల వాహనాల సందడి ప్రారంభమైంది.గత నెలలో తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు గాలికొండ,బీసుపురం మధ్యలో గల మలుపు రోడ్డు వద్ద వరద నీటి ఉధృతికి రక్షణ గోడ కూలిపోవడంతో పాటు భారీగా రోడ్డు కోతకు గురైంది.దీంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని కార్లు,ఆటోలు,మినీ వ్యాన్లు, ద్విచక్ర వాహనాలకు మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించేలా ప్రభుత్వ ఉన్నతాధికారులు పోలీసులు చర్యలు తీసుకున్నారు. అప్పటినుంచి ఆర్టీసీ బస్సుల సర్వీసులు, నిత్యావసర సరుకుల రవాణా నిలిచిపోయాయి. అయితే కోతకు గురైన ప్రదేశంలో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టి పూర్తి చేయడంతో శనివారం నుంచి యథావిధిగా వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చినట్టు పోలీసులు విలేకరులకు తెలిపారు.ఆర్టీసీ బస్సుల సౌకర్యం లేకపోవడం పట్ల మూడు వారాలుగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ గత్యంతరం లేక తేలికపాటి ప్రైవేటు వాహనాలపై ఆధారపడి అధిక మొత్తం చెల్లించి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.