ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితాల ప్రచురణ: అభ్యంతరాల స్వీకరణకు ఆహ్వానం.
కావలి మేజర్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన జీవో ఆర్టీ నెంబర్ 1298 ఉత్తర్వులకు అనుగుణంగా కావలి పురపాలక సంఘం పరిధిలోని ఓటర్ల జాబితాను సిద్ధం చేసినట్లు మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ తెలిపారు. 1వ వార్డు నుండి 44వ వార్డు వరకు గల ఓటర్ల జాబితాలో షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), మహిళలు మరియు వెనుకబడిన తరగతుల (బీసీ) ఓటర్లను గుర్తించి వర్గీకరించిన (మార్కింగ్ చేసిన) ప్రాథమిక జాబితాను 'ఫారం-1' లో మంగళవారం మున్సిపల్ కార్యాలయ నోటీస్ బోర్డుపై ప్రచురించినట్లు ఆయన వెల్లడించారు.
బుధవారంలోగా అభ్యంతరాలు సమర్పించాలి.
కావలి పట్టణ ప్రజలు, ఓటర్లు తమ తమ వార్డులకు సంబంధించిన వర్గీకరణ జాబితాలను పరిశీలించుకోవాలని కమిషనర్ సూచించారు. ఈ జాబితాలపై ఏవైనా క్లైమ్‌లు (హక్కుల విజ్ఞప్తులు) ఉన్నట్లయితే ఫారం-2 లో, అలాగే ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఫారం-3 లో పూర్తి వివరాలతో దరఖాస్తులను పూర్తి చేసి, బుధవారం నాటికల్లా పురపాలక సంఘ కార్యాలయంలో అందజేయాలని కోరారు.
నిర్ణీత గడువులోగా వచ్చిన విజ్ఞప్తులు, అభ్యంతరాలను మాత్రమే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.