'ఆర్నబ్’ తుఫాన్ కు అనకాపల్లి జిల్లా పోలీస్ హై అలర్ట్ - సర్వసన్నద్ధం.
ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే ధ్యేయంగా క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు.
- ఎస్పీ తుహిన్ సిన్హా.
అనకాపల్లి, అక్టోబర్ 27, మేజర్ న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఆర్నబ్’ తుఫాన్ ప్రభావం దృష్ట్యా అనకాపల్లి జిల్లా ప్రజలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తమై సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టిందని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. జిల్లా పోలీసు శాఖ చేపట్టిన కీలక చర్యలు చేపడుతుందన్నారు. తీర ప్రాంతాలు, ముంపు ముప్పు ఉన్న లోతట్టు గ్రామాల ప్రజలను, వృద్ధులను, చిన్నారులను పోలీసులు దగ్గరుండి సురక్షిత తుఫాన్ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అత్యవసర రెస్క్యూ ఆపరేషన్ల కోసం ఎన్డిఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ప్రత్యేక బలగాలను సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించారు. స్థానిక పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. ఈదురు గాలుల ధాటికి రహదారులపై విరిగిపడిన భారీ వృక్షాలు, కొమ్మలను క్రేన్లు, వుడ్ కట్టర్ల సహాయంతో పోలీసులు తక్షణమే తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరిస్తున్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కలిపి మొత్తం 73 జేసీబీలు, 2 భారీ హైడ్రాలిక్ క్రేన్లు, 77 వుడ్ కట్టర్లు, 34 జనరేటర్లు, ట్రాక్టర్లు, 179 మంది సహాయక సిబ్బందిని సర్వసన్నద్ధంగా ఉంచారు. విద్యుత్ సరఫరా లేదా సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌లు నిలిచిపోయినా సహాయక చర్యలకు అంతరాయం కలగకుండా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుండి మారుమూల స్టేషన్ల వరకు ప్రత్యేక వైర్‌లెస్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ మరియు శాటిలైట్/విహెచ్ఎఫ్ వ్యవస్థను నిరంతరం అందుబాటులో ఉంచారు. తుఫాన్ తీవ్రత తగ్గే వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని తీర గ్రామాల్లో డప్పు చాటింపులు, మైకుల ద్వారా విస్తృత అవగాహన కల్పించారు. తీరప్రాంత గస్తీని ముమ్మరం చేశారు. తుఫాన్ గడిచేవరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, శిథిలావస్థలో ఉన్న భవనాలు, విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాల కింద ఉండరాదని ఎస్పీ కోరారు. ఎలాంటి ఆపద లేదా అత్యవసర సహాయం కావాలన్నా స్థానిక పోలీసులను లేదా డయల్ 112 / 100, జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 94409 04229 నంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.