కోనసీమ ప్రజలకు అండగా ఉంటా
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం‘అర్నబ్’ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు విజ్ఞప్తి చేశారు. తుపాను ప్రభావం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా జిల్లా అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటానని, ఈ పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. యానాం పరిసరాల్లో తీరం డేట్ అవకాశం ఉన్నందున తాను అమలాపురం లో ఉండి పరిస్థితి సమీక్షిస్తున్నట్లు సాన తెలిపారు.తుపాను కదలికలు, భారీ వర్షాల ప్రభావం, లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులపై అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహాయక చర్యలపై దృష్టి సారిస్తానని తెలిపారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, అధికార యంత్రాంగం సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు.తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సహాయం పొందాలని ఎంపీ సూచించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలు, నీటితో నిండిన ప్రాంతాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.ప్రజలకు అవసరమైన సహాయం అందేలా జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూన్నానని ఎంపీ సానా సతీష్ బాబు పేర్కొన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని, ఈ తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.