ఏపీ సేవ పోర్టల్ సేవలను పునరుద్దరించాలి ఎమ్మెల్యేను కలసి విన్నవించిన మీ సేవా నిర్వాహకులు
పలమనేరు
మీసేవ మరియు ఏపీ సేవ పోర్టలలో తొలగించిన ముఖ్యమైన సేవలను ప్రభుత్వం పునరుద్ధరించేలా చూడాలని మీసేవ నిర్వాహకుల సమైక్య సంక్షేమ సంఘం నాయకులు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని మంగళవారం కలసి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... ఇటీవల మీసేవ మరియు ఏపీ సేవ పోర్టల్ నుండి అత్యంత కీలకమైన సేవలను ఆపేయడం జరిగిందన్నారు. ప్రత్యేకించి కులం మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రాల పట్టాదారు పాసుబుక్ రీప్రింట్ వాటర్ టాక్స్ చెల్లింపులు జనన, మరణ సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన సేవలను ఆపేయడం వల్ల క్షేత్రస్థాయిలో అనేక తీవ్రమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. దీంతో మీ సేవ నిర్వాహకుల జీవనోపాధితో పాటు రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాబట్టి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వారు కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తన వంతు సహకారం అందిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలసి విన్నవించిన వారిలో మీ సేవా సంఘం నిర్వహకులు రెడ్డిప్రసాద్, భాస్కర్, చింటూ, బాబు తదితరులు ఉన్నారు.