ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ ఆరోపణలు నిరాధారం: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ ఆరోపణలు నిరాధారం: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
భీమవరం, మేజర్ న్యూస్:
ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ‘ఓట్ చోరీ’ ఆరోపణలు నిరాధారమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. వరుస రాజకీయ పరాజయాలను కప్పిపుచ్చుకునేందుకే రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మంగళవారం భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎన్నికల సంఘం రూపొందించిన ఓటర్ల జాబితా ముసాయిదాను తుది జాబితాగా చిత్రీకరిస్తూ 13 కోట్ల ఓట్లు తొలగించారంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమని శ్రీనివాస వర్మ అన్నారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు దాఖలు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని తెలిపారు. మరణించిన వారు, ఆచూకీ లేని వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉన్న ఓటర్ల వివరాలను పరిశీలించే ప్రక్రియను తప్పుగా అర్థం చేసుకోవద్దన్నారు.ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు హక్కు ఉండాలన్న కనీస అవగాహన రాహుల్ గాంధీకి లేకపోవడం విచారకరమని ఆయన విమర్శించారు. నకిలీ, డూప్లికేట్ ఓట్లను తొలగించే ప్రక్రియను కూడా వ్యతిరేకించడం బాధ్యతారాహిత్యమన్నారు. రాజ్యాంగ సంస్థలపై బురదజల్లడం మానుకుని రాహుల్ గాంధీ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.కొత్త ఓటరు నమోదుకు సంబంధించిన ఫారం-6లో ఎలాంటి అక్రమ మార్పులు చేయలేదని శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. ఓటర్ల సౌకర్యం కోసం గతంలో వేర్వేరుగా ఉన్న ప్రక్రియలను సులభతరం చేశామని తెలిపారు. ఎన్నికల సంఘం ఓటరు నమోదు, తొలగింపు, వివరాల సవరణకు నిర్దిష్ట విధానాలను అమలు చేస్తోందన్నారు.“గెలిచినప్పుడు ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తాయి.. ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంలదే తప్పా?” అని రాహుల్ గాంధీతో పాటు విపక్షాల వైఖరిని శ్రీనివాస వర్మ ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపోటములను బట్టి ఈవీఎంల విశ్వసనీయతపై భిన్నమైన వాదనలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని శ్రీనివాస వర్మ ఆరోపించారు. విదేశీ పర్యటనల్లో భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడం కూడా సరికాదన్నారు. గతంలో పలు అంశాల్లో ఆరోపణలు చేసి, వాటిపై వివాదాలు తలెత్తిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పుడు ఎన్నికల సంఘంపై చేస్తున్న ఆరోపణలకు కూడా ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్, ఇండియా కూటమి రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ సంస్థలపై అనుమానాలు కలిగించే ప్రచారాన్ని మానుకోవాలని కేంద్రమంత్రి సూచించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుభాష్ రాజు, కాయిత సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట గంగరాజు, భీమవరం మండలాధ్యక్షుడు వబిలిశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీనివాస్ భీమవరం