ఎన్నికల సామగ్రి పంపిణీలో అప్రమత్తంగా ఉండాలి
పిఎం పాలెం, సూర్య : జీవీఎంసీ రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మధురవాడ జోన్‌లోని సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లు, ఎన్నికల సాగ్రి పంపిణీ కేంద్రాలు, హెల్ప్ డెస్క్‌లు, పోలీసు బందోబస్తు, బస్సుల పార్కింగ్ ఏర్పాట్లను జీవీఎంసీ కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ శనివారం స్పెషల్ ఆఫీసర్ పద్మలత, అదనపు కమిషనర్ పి.ఎం. సత్యవేణితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎన్నికల సామగ్రి పంపిణీలో జాగ్రత్తలు పాటించాలని, ఎన్నికల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ఆహారం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఉదయం 7 గంటలకు విధుల్లో చేరే సిబ్బందికి 5.30 నుంచి 6 గంటల మధ్య అల్పాహారం అందించాలని, పంపిణీ కేంద్రాలు, హెల్ప్ డెస్క్‌లు, బస్సుల పార్కింగ్ ప్రాంతాలను గుర్తించేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. వర్ష సూచన నేపథ్యంలో వాటర్‌ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయడంతో పాటు, బ్యాలెట్ బాక్సులపై సంబంధిత జోన్ పేరు, వార్డు నెంబరు, పోలింగ్ కేంద్రం నంబరు స్పష్టంగా ఉండేలా చూడాలన్నారు.
పోలింగ్ సిబ్బందిని సకాలంలో కేంద్రాలకు చేర్చేందుకు బస్సు రూట్లను ముందుగానే ఖరారు చేయాలని, బస్సుల కేటాయింపు, పార్కింగ్, రాకపోకల్లో ఇబ్బందులు లేకుండా మెకానికల్, ఇంజనీరింగ్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సిటీ ఆపరేషన్స్ సెంటర్ ద్వారా ఎన్నికల ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించాలని సూచించారు.
అనంతరం ఆర్‌హెచ్ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి, ఓటర్లకు తాగునీరు, సూచిక బోర్డులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అక్కడి చిన్నారులకు చాక్లెట్లు, బిస్కెట్లు అందించారు.
తదుపరి చంద్రంపాలెం పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు సిబ్బందిని నియమించి పటిష్ఠ భద్రత కల్పించాలని పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణకు సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు, ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ ఇప్పి నాయుడు, రిటర్నింగ్ అధికారులు ఆదినారాయణ, ఉమామహేశ్వరరావు, మధురవాడ సూపరింటెండింగ్ ఇంజనీర్ శాంతిరాజు, ఏసీపీ గౌడ్, ఏఎంఓహెచ్ రవి, ఇంజనీరింగ్ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీనివాస్, పిఎం పాలెం, విశాఖపట్నం.