ఎన్నికల కోడ్ అమలుపై అధికారులకు శిక్షణ - ఎంసీసీ నోడల్ అధికారి దుండి రాంబాబు సమీక్ష
అంబాజీపేట మేజర్ న్యూస్ :స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై అధికారులకు బుధవారం అంబాజీపేట డ్వాక్రా భవనంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మూడు మండలాలకు చెందిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్ సభ్యులకు ఈ శిక్షణ ఇచ్చారు. జిల్లా ఎన్నికల ప్రవర్తనా నియమావళి నోడల్ అధికారి శ్రీ దుండి రాంబాబు ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
దుండి రాంబాబు మాట్లాడుతూ ప్రతి మండలంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చొప్పున మూడు టీములు, మొత్తం మూడు మండలాలకు 9 టీములకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు, రాబోయే గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సవివరంగా వివరించారు.
ఎంసీసీ టీమ్ ప్రతి గ్రామం పర్యటించి ఎక్కడా కోడ్ ఉల్లంఘన జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ సభ్యులు చెక్ పోస్టుల వద్ద నిఘా ఏర్పాటు చేసి, రూ.10 వేల విలువకు మించి వస్తువులు, రూ.50 వేలకు మించి నగదు, లిక్కర్ తదితర అంశాలు భారీ స్థాయిలో రవాణా అవుతుంటే వాహనాలు తనిఖీ చేసి, రసీదులు లేనిపక్షంలో సీజ్ చేసి పోలీసు, ట్రెజరీ శాఖలకు అప్పగించి కేసు నమోదు చేయాలని సూచించారు.
ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ మండలమంతా తిరుగుతూ ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే స్పందించి, జిల్లాస్థాయి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సెల్ తో టచ్ లో ఉంటూ నివేదిక సమర్పించాలని, మూడు టీములు ప్రతిరోజూ జిల్లాస్థాయికి అనెక్సర్లు సమర్పించాలని తెలిపారు. ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మూడు మండలాలకు చెందిన తొమ్మిది టీముల సభ్యులు పాల్గొన్నారు.