ఎన్ ఓసిల జారీలో నంద్యాల మున్సిపాలిటీ నిర్లక్ష్యం - అభ్యర్థుల్లో ఆందోళన
సూర్య, నంద్యాల బ్యూరో: నంద్యాల మున్సిపాలిటీలో నో అబ్జక్షన్ సర్టిఫికేట్ల జారీలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష వైసీపీ, స్వతంత్ర్య అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నంద్యాల మున్సిపల్ కమీషనర్ బండి శేషన్న తీరుపై అభ్యర్థులు మండిపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు మున్సిపల్ కార్యాలయం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వడంలో కమీషనర్ కావాలనే అలసత్వం వహిస్తున్నారని వైకాపా మరియు స్వతంత్య్ర అభ్యర్థులు తీవ్రస్థాయిలో అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి ఒకలా! ఇతర పార్టీలకు ఒకలాగా! కమీషనర్ వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థులకు ఎన్ ఓసిలను ముందుగానే మంజూరు చేశారని ఆరోపిస్తున్నారు. వైకాపా, ఇండిపెండెంట్ అభ్యర్థులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికి ఎన్ఐఓసీలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియకు కేవలం మూడు రోజులు మాత్రమే గడువు ఉందని, ఇంత తక్కువ సమయంలో ఎన్ ఓసిలు జారీ చేయకపోతే తాము పోటీ రేసు నుంచి తప్పుకోవాల్సి వస్తుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల పక్షపాత వైఖరి వల్ల తమ ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలుగుతోందని వాపోతున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. పోటీ చేసే అభ్యర్ధులందరికి ఎన్ ఓసిలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*