ఎంపీపీ, జడ్పిటిసి స్థానాల గెలుపే లక్ష్యం ..
- పోలాకి మండల నాయకులతో ధర్మాన కృష్ణదాస్.
నరసన్నపేట అక్టోబర్ 11 మేజర్ న్యూస్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. నరసన్నపేటలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పోలాకి మండల ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన, యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొని ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలాకి మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు అత్యధిక మెజార్టీ సాధించేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తూ ప్రజలతో నిరంతరం మమేకం కావాలని, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని అన్నారు.
డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సర్వసన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని పేర్కొంటూ, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించి ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో పోలాకి మండలానికి చెందిన పార్టీ ముఖ్య నాయకులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.