ఏకగ్రీవ పంచాయతీలకు జాక్ పాట్!
రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకం - ప్రభుత్వం కీలక జీవో జారీ
జీవో ప్రతిని పత్రికలకు విడుదల చేసిన అడ్డరోడ్డు ఆర్డీఓ రామలక్ష్మి
ఎస్.రాయవరం, నవంబర్ 13, మేజర్ న్యూస్:
2026లో జరగనున్న గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల్లో ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రోత్సాహక నిధిని భారీగా పెంచుతూ పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక జీవో ను జారీ చేసింది. ఈ కీలక జీవో ప్రతి ని అడ్డరోడ్డు ఆర్డీఓ కె.వి.రామలక్ష్మి శుక్రవారం పత్రికలకు విడుదల చేసారు. గ్రామాల్లో సామరస్యం, ఐక్యతను పెంచడం, ఎన్నికల్లో అనవసర ఖర్చులు, గొడవలు నివారించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
గతంలో 2020లో ఇచ్చిన ప్రకారం ఉన్న నిధిని ఇప్పుడు రెట్టింపు కంటే ఎక్కువగా పెంచింది. 5,000 జనాభా లోపు పంచాయతీలు ఏకగ్రీవమైతే - రూ.15 లక్షలు
5,001 నుంచి 10,000 జనాభా పంచాయతీలు - రూ.25 లక్షలు
10,000 జనాభా పైబడిన పంచాయతీలు - రూ.50 లక్షలు
ఈ నిధులు రావాలంటే...
సర్పంచ్, వార్డు సభ్యులందరూ అధికారికంగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించాలి. వచ్చిన నిధులు గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమ పనులకే ఖర్చు చేయాలి. ఈ నిధులు పంచాయతీ పదవీ కాలంలో విడతల వారీగా విడుదలవుతాయి.
ఇది ఎవరి పోటీ చేసే హక్కును, ఓటు హక్కును అడ్డుకోవడం కాదని, కేవలం గ్రామాల్లో ఏకాభిప్రాయాన్ని ప్రోత్సహించడానికేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు కేవలం 2026 సాధారణ పంచాయతీ ఎన్నికలకు మాత్రమే వర్తిస్తాయని స్పెషల్ చీఫ్ సెక్రటరీ కాంతిలాల్ దండే తెలిపారు. కలెక్టర్లు, పీఆర్ కమిషనర్ ఈ పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆదేశించారు.