డిశంబరు 4-6 తేదీల్లో తిరుపతిలో డిజిపిలు,ఐజిపిల సమావేశం-ప్రధాని,హోంమంత్రి హాజరు
అమరావతి,మేజర్‌న్యూస్:
డిశంబరు 4నుండి 6వతేదీ వరకు తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (IISER)లో డిజిపిలు,ఐజిపిల జాతీయ స్థాయి సమావేశం జరగనుంది.ఈసమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి,కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు హాజరు కానున్నారు.ఇందుకు సంబంధించి సోమవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఇంటర్ డిపార్టుమెంటల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించి చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.ఈమూడు రోజుల కాన్పరెన్సుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సంబంధిత శాఖల కార్యదర్శులు ఇతర అధికారులు ఇప్పటి నుండే ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడి,కేంద్ర హోం మంత్రి అమిత్ షా,వివిధ రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన డిజిపిలు,ఐజిపిలు సహా 200 మందికి పైగా ఐపిఎస్ అధికారులు,200 మంది వరకూ ఐబి అధికారులు,స్టేట్ అండ్ సెంట్రల్ ఫోర్సెర్సెస్ అధికారులు,ఎన్ఎస్ఏ,కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గోనున్నారని సిఎస్ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మొదటి రెండు రోజులు ఈసమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉందని కావున అందుకనుగుణంగా తగిన విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్ సాయి ప్రసాద్ అధికారులను ఆదేశించారు.తిరుపతి నగరమంతా సుందరీకరణ,ఇతర ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేపట్టాలని చెప్పారు.ఇంకా ఇతర ఏర్పాట్లకు సంబంధించి ఆయా శాఖల అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.నెట్ వర్కు సమస్య లేకుండా సమావేదిక ప్రాంతంలో ప్రత్యేక టవర్ ఏర్పాటు చేయాలని ఐటి శాఖ అధికారులను ఆదేశించారు. ఈసమావేశానికి వర్చువల్ గా హాజరైన డిజిపి హరీశ్ కుమార్ గుప్త మాట్లాడుతూ డిశంబరులో జరిగే డిజిపిలు,ఐజిపిల సమావేశానికి సంబంధించి ప్రతి 15 రోజులకు ఒకసారి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించాలని సిఎస్ కు సూచించారు.కమిటీలోని ఉన్నతాధికారులు అందరూ ఏర్పాట్లకు సంబంధించి పూర్తిగా భాగస్వాములు కావాలని విజ్ణప్తి చేశారు. ఈసమావేశంలో అదనపు డిజిపి మధుసూదన్ రెడ్డి,హోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్,సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామల రావు,కమీషనర్ సెకండరి హెల్తు చక్రధర్ బాబు,ఎస్ఐబి డిప్యూటీ డైరెక్టర్ అంబిక,ఐజి కాంతి రాణా తాతా తదితర అధికారులు పాల్గొన్నారు.అలాగే వర్చువల్ గా టిటిడి ఇఓ యం.రవిచంద్ర, ఎంఎయుడి ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్,టిఆర్అండ్బి కార్యదర్శి కె.శశిధర్,తిరుపతి కలెక్టర్ డా.వెంకటేశ్వర్,ఎస్పి,ఇతర విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు,ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శిలు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.