ధర్మవరం ఎన్నికల వేళ ఉద్రిక్తతలు.. వైసీపీపై మంత్రి సత్యకుమార్ విమర్శలు
రిపోర్టర్ వెంకటేష్ మేజర్ న్యూస్ : ధర్మవరం మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ స్పందించారు. వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా వివాదాలు సృష్టిస్తూ రాజకీయ ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తున్నారని విమర్శించారు. నామినేషన్ పత్రాలు చించివేశారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవాలన్న ఉద్దేశం తమకు లేదని మంత్రి స్పష్టం చేశారు. నిజంగా అడ్డుకోవాలని భావిస్తే వారు నామినేషన్లు దాఖలు చేసే పరిస్థితి ఉండేది కాదని వ్యాఖ్యానించారు. ఎన్నికలతో ప్రత్యక్ష సంబంధం లేని బయటి వ్యక్తులు ధర్మవరానికి వచ్చి అలజడి సృష్టించడం వెనుక ఉద్దేశమేమిటని ప్రశ్నించారు. గతంలో క్రిమినల్ కేసులు ఎదుర్కొన్నవారు కూడా ఈ ఘటనలో ఉన్నారన్న సమాచారం ఉందని ఆరోపించారు. గాయాలయ్యాయని చెబుతూ ప్రభుత్వ ఆసుపత్రిలోని వీల్చైర్లను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లడంపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన సదుపాయాలను రాజకీయ వివాదాలకు ఉపయోగించడం సరికాదన్నారు. గాయాల తీవ్రతపై వైద్య పరీక్షలు, సంబంధిత ఆధారాల ఆధారంగా నిర్ధారణ జరగాలని పేర్కొన్నారు.ప్రజాస్వామ్యంలో ప్రతి అభ్యర్థికి నామినేషన్ దాఖలు చేసే హక్కు ఉందని మంత్రి గుర్తుచేశారు. ఎన్నికల సంఘం నిబంధనలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలని కోరారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని వర్గాలు సహకరించాలని సూచించారు. ధర్మవరం ఘటనపై ఇరువర్గాల ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో అసలు వాస్తవాలు అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.