చీరాల సబ్ డివిజన్ పరిధిలోని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్
చీరాల, మేజర్‌న్యూస్ :
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని విధాలా చర్యలు చేపట్టామని బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు తెలిపారు. గురువారం చీరాల 1టౌన్ పోలీస్ స్టేషన్ లో చీరాల సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులతో, చీరాల 1టౌన్ పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరగనున్న మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద బందోబస్తు, ఓట్ల లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు ఆదేశాలు జారిచేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చీరాల సబ్ డివిజన్ పరిధిలోని అధికారులందరితో సమావేశం నిర్వహించి, ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యలపై సమీక్షించమన్నారు.
చీరాల మున్సిపాలిటీ పరిధిలోని 44 వార్డులకు సంబంధించి 44 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. వీటిని ఆరు జోన్లుగా విభజించి 12 రూట్ మొబైల్ పార్టీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 2 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు, 3 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇప్పటికే స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు, చెక్‌పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు నిరంతరం కొనసాగుతున్నాయన్నారు.
చీరాల సబ్ డివిజన్ పరిధిలో ఐదు జడ్పీటీసీ, 82 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. వీటికి సంబంధించి 12 జోన్లుగా, 60 రూట్లుగా విభజించి 60 రూట్ మొబైల్స్, ఐదు స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు, 31 రూట్ మొబైల్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు క్యూలైన్లు, బారికేడ్లు, పార్కింగ్ సదుపాయాల ఏర్పాటుపై అధికారులకు వివరించినట్లు తెలిపారు.
ఎన్నికల ప్రక్రియను సమర్థ్ యాప్ ద్వారా బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. సమస్య తలెత్తిన ప్రాంతానికి సమీపంలో ఉన్న పోలీసు సిబ్బంది రియల్ టైమ్‌లో అక్కడికి చేరుకుని తక్షణ చర్యలు తీసుకునేలా ఈ వ్యవస్థను వినియోగిస్తామని పేర్కొన్నారు.
అంతేకాకుండా, పోలీసు కమ్యూనికేషన్ విభాగం ద్వారా రిపీటర్ టవర్లు, VHF సెట్స్, మ్యాన్‌ప్యాక్‌ల సహాయంతో సమర్థవంతమైన సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జిల్లాలోని ప్రజలందరూ ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని విధాలా చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ గారు స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండి, సమన్వయంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.
చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను ఎస్పీ గారు స్వయంగా పరిశీలించి అక్కడ తీసుకోవలసిన భద్రతాపరమైన చర్యల గురించి పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో చీరాల డిఎస్పి ఎండి.మోయిన్, చీరాల వన్ టౌన్, టూ టౌన్, రూరల్, ఇంకొల్లు సీఐలు సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, చీరాల 1టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.