బ్రాహ్మణపల్లిలో ఇక టీడీపీ జెండానే..! మంత్రి ఆనంకు తొలి బహుమతి
మర్రిపాడు, మేజర్ న్యూస్: జిల్లాలోని మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి సెగ్మెంట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసింది. ఆ గ్రామానికి చెందిన అన్నవరం దేవస్థానం డైరెక్టర్ బిజివేముల సురేంద్రనాథ్ రెడ్డి రాజకీయ కోణంలో వ్యూహాత్మక చర్యలు తీసుకోవడంతో మేకపాటి కుటుంబం స్వగ్రామంలోనే పసుపు జెండా ఎగిరింది. బ్రాహ్మణపల్లి సెగ్మెంట్లో ఆ గ్రామంలో పాటు కంపసముద్రం కూడా ఉంది. ఈ నేపథ్యంలో తనదైన శైలిలో బిజివేముల సురేంద్ర రాణించడంతో రెండు పంచాయితీల్లో సైకిల్ జోరందుకొని విజయం సాధించింది. దీనికి తోడు మంత్రి ఆనం ఆశీస్సులు కూడా ప్రధాన పాత్ర పోషించాయి. మేకపాటి కుటుంబం స్వగ్రామంలోనే వైసీపీ ఓటమి తప్పలేదని చెప్పవచ్చు. ఒక్కసారిగా వైసీపీ జెండాను వదిలి సైకిల్ జోరందుకోవడంతో పలువురు నివ్వెరపోక తప్పలేదు. ఎన్నో సంవత్సరాల తరబడి నుండి మేకపాటి కుటుంబం వెంబడి నడిచిన ఆ సెగ్మెంట్ ప్రజలు ఒక్కసారిగా వారిని వీడి బిజివేముల వెంట నడవడం పట్ల ఆయన ఆంతర్యానికి అర్థం పడుతోంది. ఎన్నడూ లేని విధంగా ఇంటింటా ప్రచారం, సమస్యల పరిష్కారానికి తోడై ఉంటానని హామీలు, పేద, మధ్యతరగతి కుటుంబాలకు సహాయ సహకారాలు తోడవడంతో ఆ గ్రామాల ప్రజలు ఆయన వెంట నడవక తప్పలేదు. ఈ సందర్భంగా సురేంద్రనాథ్ రెడ్డి మొదటిగా బ్రాహ్మణపల్లి సెగ్మెంట్ను రాష్ట్రమంత్రి ఆనం రామనారాయణరెడ్డికి తొలి బహుమతిగా ఇస్తున్నానని తెలియజేస్తున్నారన్నారు. ఇక బ్రాహ్మణపల్లిలో ఎగిరేది తెలుగుదేశం పార్టీ జెండానేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.