భూమి మీదే.. హక్కు మీదే!
-రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 40.58 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ
-16.48 లక్షల ఎకరాల భూమికి 22ఏ నిషేధిత జాబితా నుంచి విముక్తి
- రైతుల భూహక్కుల కోసం చంద్రబాబు కీలక అడుగులు
-రూ.166 కోట్లతో పాలేరు రిజర్వాయర్.. 16.48 లక్షల ఎకరాలకు నిషేధిత జాబితా నుంచి విముక్తి!
-రైతులు హలం పట్టుకుని పొలానికి వెళ్లాలి..
- అర్జీలు పట్టుకుని అధికారుల చుట్టూ తిరగకూడదు
-9,500 ఎకరాలకు సాగునీరు.. 15 గ్రామాల్లో 35 వేల మందికి తాగునీరు
-పొన్నలూరు మండలం వేమూరుపాడు రోడ్డు, పాలేరు నదిపై వంతెనకు రూ.28 కోట్లతో శంకుస్థాపన
-ప్రకాశం జిల్లాలో గర్భ కండ్రిక భూ సమస్యల పరిష్కారానికి చర్యలు.. 2,915 ఎకరాలకు విముక్తి కల్పించే ప్రక్రియ
ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :
రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించి, భూ వివాదాలకు తావులేకుండా పారదర్శకమైన రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రైతులు హలం పట్టుకుని పొలానికి వెళ్లాలే తప్ప, అర్జీలు పట్టుకుని అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని అన్నారు. భూమిపై యజమానులకు స్పష్టమైన హక్కులు కల్పించేందుకు రీసర్వే ప్రక్రియను పూర్తి చేస్తున్నామని, రాజముద్రతో కూడిన పటిష్ఠమైన పట్టాదారు పాస్‌పుస్తకాలను అందిస్తున్నామని వెల్లడించారు. శుక్రవారం ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం నర్సింగోలులో నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం పాల్గొని బహిరంగ సభలో ప్రసంగించారు.
రైతుల భూహక్కుల పరిరక్షణే లక్ష్యం
గత పాలనలో భూముల విషయంలో అనేక సమస్యలు ఏర్పడ్డాయని, ఆక్రమణలు, భూ వివాదాలు, రెవెన్యూ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చంద్రబాబు విమర్శించారు. ఆస్తులు ప్రజలవే అయినప్పటికీ, పట్టాదారు పాస్‌పుస్తకాలు, సర్వే రాళ్లపై వ్యక్తిగత చిత్రాలు ఉంచి రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు కారణంగా భూముల విషయంలో వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటూ, తమ ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసిందని తెలిపారు.భూ యజమానులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలు చేపడుతున్నామని చెప్పారు. భూముల వివరాలను డిజిటలైజ్ చేయడంతో పాటు రీసర్వే ప్రక్రియ ద్వారా హక్కులను స్పష్టంగా నమోదు చేస్తున్నామని వివరించారు. రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేస్తుందని స్పష్టం చేశారు.
40.58 లక్షల పాస్‌పుస్తకాల పంపిణీ
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 40.58 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అక్టోబర్ నెలలోనే 790కి పైగా గ్రామాల్లో నాలుగు లక్షలకు పైగా రాజముద్రతో కూడిన పాస్‌పుస్తకాలను అందించామని తెలిపారు. ఇంకా పంపిణీ చేయాల్సిన సుమారు 51 లక్షల పాస్‌పుస్తకాలను నెలవారీ లక్ష్యాలతో పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.రాష్ట్రంలోని చిట్టచివరి భూ యజమానికి కూడా పారదర్శకంగా పాస్‌పుస్తకం అందించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమం సక్రమంగా పూర్తయ్యే వరకు ప్రతి నెలా ప్రజల ముందుకు వస్తూ పంపిణీ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ చేపడుతున్నామని తెలిపారు.
16.48 లక్షల ఎకరాలకు నిషేధిత జాబితా నుంచి విముక్తి
భూములకు సంబంధించిన నిషేధిత జాబితా సమస్యల పరిష్కారంపై కూడా చంద్రబాబు కీలక వివరాలు వెల్లడించారు. గత పాలనలో కొందరి భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఇప్పటివరకు 16.48 లక్షల ఎకరాల భూమిని ఆ జాబితా నుంచి తొలగించిందని తెలిపారు. కంగుంది, అమలాపురం, శెట్టిపల్లి తదితర ప్రాంతాల్లో వివాదాల్లో ఉన్న 41 వేల ఎకరాలకు విముక్తి కల్పించామని పేర్కొన్నారు.ప్రకాశం జిల్లాలో నాలుగు మండలాల్లోని 2,915 ఎకరాల గర్భ కండ్రిక భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. వివిధ కేటగిరీల్లో ఉన్న భూముల వివరాలను డిజిటలైజ్ చేసి, రైతులు మరియు భూ యజమానులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
రూ.166 కోట్లతో పాలేరు రిజర్వాయర్
కొండపి ప్రాంత సాగునీటి అవసరాలను తీర్చేందుకు పోతుల చెంచయ్య పాలేరు రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. రూ.166 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే సుమారు 9,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. ఈ ప్రాంతంలోని 15 గ్రామాల్లో 35 వేల మందికి తాగునీటి సదుపాయం కలుగుతుందని వివరించారు.ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాంత నీటి అవసరాలను పరిష్కరించేందుకు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తామని, నిర్ణీత కాలవ్యవధిలో పనులు పూర్తి చేసి ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.
రూ.28 కోట్లతో రోడ్డు, వంతెన పనులు
పొన్నలూరు మండలం వేమూరుపాడు రోడ్డు అభివృద్ధితో పాటు పాలేరు నదిపై వంతెన నిర్మాణానికి రూ.28 కోట్లతో శంకుస్థాపన చేసినట్లు చంద్రబాబు తెలిపారు. రహదారులు, వంతెనల నిర్మాణంతో గ్రామాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని, రైతులు తమ పంటలను మార్కెట్లకు తరలించేందుకు సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు. సాగునీరు, తాగునీరు, రహదారుల వంటి మౌలిక సదుపాయాల కల్పన ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతర కృషి
రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీపడబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులు, నిధుల కోసం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలసి విజ్ఞప్తులు చేశామని తెలిపారు. గత పాలనలో ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి ప్రజాప్రతినిధులు, అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. రైతులకు భూహక్కుల భరోసా, పెండింగ్ భూ సమస్యల పరిష్కారం, సాగునీటి వసతుల విస్తరణే నర్సింగోలు సభలో ముఖ్యమంత్రి ప్రసంగంలో ప్రధానాంశాలుగా నిలిచాయి.