భోగాపురం ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ!
*సమయం దాటుతున్నా సమావేశానికి చేరుకోని 10 మంది సభ్యులు..
* ఎన్నిక కొనసాగుతుందా? వాయిదా పడుతుందా?
భోగాపురం, మేజర్ న్యూస్:
భోగాపురం మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) ఎన్నిక తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. మండల పరిషత్ పీఠాన్ని దక్కించుకునే విషయంలో రాజకీయ సమీకరణాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తికాగా, మధ్యాహ్నం మూడు గంటలకు ఎంపీపీ ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. అయితే నిర్ణీత సమయం దాటుతున్నప్పటికీ వైఎస్సార్‌సీపీ తరఫున విజయం సాధించిన ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు మాత్రమే ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు జనసేన పార్టీకి చెందిన ముగ్గురు, తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు, స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన నలుగురు సభ్యులు సమావేశానికి హాజరుకాకపోవడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. మొత్తం 16 మంది సభ్యులతో కూడిన మండల పరిషత్‌లో 10 మంది సభ్యుల గైర్హాజరు రాజకీయ పరిణామాలకు కేంద్రబిందువుగా మారింది. ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు అవసరమైన సభ్యుల మద్దతు కూడగట్టే అంశం ఇప్పటికే రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తుండగా, తాజాగా సభ్యుల గైర్హాజరు కొత్త ప్రశ్నలకు తావిస్తోంది. నిర్ణీత సమయంలో సభ్యులు హాజరుకాకపోతే ఎన్నికల అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందా? లేక వాయిదా పడుతుందా? అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మండల పరిషత్ అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠకు తెరపడాల్సిన వేళ, సభ్యుల గైర్హాజరుతో రాజకీయ సమీకరణాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి.
రిపోర్టర్: వై.శ్రీనివాస్, భోగాపురం.