భీమవరం మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల 52 వార్డులకు ఎన్నికలు.. 14 నుంచి నామినేషన్ల స్వీకరణ 157 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు.. నవంబర్ 26న పోలింగ్, 30న కౌంటింగ్
భీమవరం, మేజర్ న్యూస్: భీమవరం పురపాలక సంఘం ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో పట్టణంలో ఎన్నికల సందడి మొదలైంది. చైర్పర్సన్ పదవితో పాటు మొత్తం 52 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ కేంద్రాలు, శాంతిభద్రతలపై మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, డి.ఎస్.పి రఘువీర్ విష్ణు సంయుక్తంగా మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
భీమవరం మున్సిపాలిటీలో విలీనమైన తాడేరు, చినఅమిరం, రాయలం, కొవ్వాడ, అన్నవరం గ్రామాలతో కలిపి మొత్తం 52 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయని కమిషనర్ తెలిపారు. నవంబర్ 14, 15, 16 తేదీల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని వెల్లడించారు. నవంబర్ 17న నామినేషన్ల పరిశీలన, 19న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుందని, అదే రోజు సాయంత్రం 5 గంటలకు తుది అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని పేర్కొన్నారు. నవంబర్ 26న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపారు.
అభ్యర్థులకు అవసరమైన అర్హతల వివరాలు, నామినేషన్ పత్రాలను మున్సిపల్ కార్యాలయంలో ఉచితంగా అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ స్పష్టం చేశారు. నామినేషన్ల ప్రక్రియ సులభతరం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 52 వార్డుల పరిధిలో మొత్తం 157 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు హాల్‌ను మున్సిపల్ కార్యాలయ ఆవరణలోనే సిద్ధం చేస్తున్నామన్నారు. చైర్పర్సన్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల అధికారులను నియమించామని, అభ్యర్థుల సందేహాల నివృత్తికి గెజిటెడ్ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. నామినేషన్ పత్రాలతో పాటు చలానా చెల్లించే సదుపాయం కూడా మున్సిపల్ కార్యాలయంలోనే కల్పించామన్నారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ఎన్నికల నేపథ్యంలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉంటుందని డి.ఎస్.పి రఘువీర్ విష్ణు హెచ్చరించారు. వాట్సాప్‌లో వచ్చే తప్పుడు ప్రచారాలు, సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యే రీల్స్‌ను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. భీమవరం పట్టణంతో పాటు ఆరు మండలాల్లో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రచార ర్యాలీలు నిర్వహించాలంటే సింగిల్ విండో విధానంలో ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. నామినేషన్ల సమయంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న సర్కిల్ దాటి ఊరేగింపులను అనుమతించబోమని హెచ్చరించారు.
ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని పాటిస్తూ అధికారులకు సహకరించాలని అధికారులు కోరారు.