బీసీలకు అండగా ఉంటాం..
34 శాతానికి మించి సీట్లు ఇస్తాం!
-బీసీలకు పార్టీ పరంగా 34 శాతం కంటే ఎక్కువ సీట్లు
-టీడీపీకి బీసీలే వెన్నెముక..
45 ఏళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకున్న చంద్రబాబు
-స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతానికి మించి సీట్లు..
- పార్టీ పరంగా అవకాశం కల్పిస్తామని హామీ
-గత ప్రభుత్వంలో 16,800 మంది బీసీలు నాయకత్వ అవకాశాలు కోల్పోయారు..
-పాలేరు నదిపై వంతెన.. రిజర్వాయర్ స్పిల్‌వే, ప్రధాన తూముల నిర్మాణానికి శంకుస్థాపన
-రిజర్వాయర్‌తో 9,500 ఎకరాలకు సాగునీరు.. 15 గ్రామాల్లో 30 వేల మందికి తాగునీరు
-కొండపి సభలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..
ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతానికి మించి సీట్లు పార్టీ పరంగా కేటాయిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. గత 45 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముకగా నిలిచారని, వారి అభ్యున్నతికి కృషి చేయడం తన బాధ్యతని పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. మరోవైపు వచ్చే ఏడాది మార్చిలోగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీని పూర్తి చేస్తామని ప్రకటించారు. భూ యజమానులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా పంపిణీ చేపడుతున్నామని తెలిపారు.
కొండపిలో ‘మీ భూమి–మీ హక్కు’ సభ
ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని నర్సింగోలులో శుక్రవారం నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ గ్రామసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మహిళా లబ్ధిదారుకు స్వయంగా పట్టాదారు పాస్‌పుస్తకాన్ని అందజేశారు. పాలేరు నదిపై వంతెన నిర్మాణంతో పాటు రిజర్వాయర్ స్పిల్‌వే, ప్రధాన తూముల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రైతులకు భూమిపై స్పష్టమైన హక్కులు కల్పించడం, సాగునీటి సదుపాయాలను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యాలని వివరించారు.
బీసీలకు రాజకీయంగా అండగా ఉంటాం
టీడీపీకి బీసీ వర్గాలు దశాబ్దాలుగా వెన్నుదన్నుగా ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలను రాజకీయంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు ఎన్టీఆర్ 24 శాతం రిజర్వేషన్లు కల్పించారని, తాను వాటిని 34 శాతానికి పెంచానని గుర్తుచేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రిజర్వేషన్లు తిరిగి 24 శాతానికి తగ్గడంతో 16,800 మంది బీసీలకు స్థానిక సంస్థల్లో నాయకత్వ అవకాశాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు.బీసీలకు రిజర్వేషన్లు పెంచేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నించిందని, అయితే 50 శాతం పరిమితిని దాటుతున్నాయనే కారణంతో న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యాయని సీఎం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కమిషన్‌ను నియమించి నివేదిక తెప్పించామని తెలిపారు. బీసీలకు రిజర్వేషన్ల అంశంపై వైఎస్సార్‌సీపీ వైఖరిని విమర్శిస్తూ, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
34 శాతానికి మించి సీట్లు ఇస్తామని హామీ
రిజర్వేషన్ల విషయంలో చట్టపరమైన పరిమితులు ఉన్నప్పటికీ, బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచేందుకు పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. “నేను హామీ ఇస్తున్నా.. స్థానిక ఎన్నికల్లో తప్పకుండా 34 శాతానికి మించి సీట్లు పార్టీ పరంగా ఇస్తాం” అని స్పష్టం చేశారు. బీసీ వర్గాలకు తగిన ప్రాధాన్యం కల్పించి, వారిని రాజకీయంగా ప్రోత్సహిస్తామని తెలిపారు. బీసీలు అభివృద్ధి చెందితే టీడీపీ బలపడుతుందనే ఉద్దేశంతో వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు.
రాజముద్రతో పాస్‌పుస్తకాలు.. మార్చిలోగా పంపిణీ పూర్తి
రైతుల భూములకు సంబంధించిన హక్కుల విషయంలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల 58 వేల పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశామని చెప్పారు. అక్టోబర్‌లో 793 గ్రామాల్లో 4 లక్షల 58 వేల మందికి పాస్‌పుస్తకాలు అందించినట్లు వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు 24,116 పాస్‌పుస్తకాలను పంపిణీ చేశామని వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో పట్టాదారు పాస్‌పుస్తకాలపై వ్యక్తిగత చిత్రాలు ఉంచడంపై విమర్శలు చేసిన చంద్రబాబు, తమ ప్రభుత్వం రాజముద్రతో కూడిన పాస్‌పుస్తకాలను అందిస్తోందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చిలోగా పాస్‌పుస్తకాల పంపిణీని పూర్తి చేస్తామని, ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులు తమ భూముల హక్కుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని చెప్పారు.
రిజర్వాయర్‌తో వేలాది ఎకరాలకు సాగునీరు
నర్సింగోలు ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రిజర్వాయర్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు తెలిపారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే సుమారు 9,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు. అలాగే 15 గ్రామాల్లో దాదాపు 30 వేల మందికి తాగునీటి సదుపాయం కలుగుతుందని వివరించారు. పాలేరు నదిపై వంతెన నిర్మాణంతో పాటు రిజర్వాయర్ స్పిల్‌వే, ప్రధాన తూముల నిర్మాణ పనులను ప్రారంభించడం ద్వారా ఈ ప్రాంతంలో నీటి వనరుల అభివృద్ధికి ముందడుగు పడుతుందని పేర్కొన్నారు.
నాణ్యతలో రాజీ ఉండదు
సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు, రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరేలా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పునర్నిర్మాణం, రైతులకు భూహక్కుల పరిరక్షణ, సాగునీటి వసతుల విస్తరణ, బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం వంటి అంశాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన ఫలితాలు అందించడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.