బడి బాగుంటేనే భావితరాలకు భరోసా
- ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రతో మాట్లాడి ప్రత్యేక నిధులు రప్పిస్తాం
- తూర్పు కోడిగుడ్లపాడు విద్యా కమిటీ నూతన సారథులకు ఘన సత్కారం
- మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్
పామూరు, మేజర్ న్యూస్ : పేద బిడ్డలు చదువుకునే సర్కారు బడులను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దినప్పుడే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని, విద్యా వికాసమే గ్రామీణ ప్రగతికి అసలైన కొలమానమని కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. మండల పరిధిలోని తూర్పు కోడిగుడ్లపాడు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన సవరం వెంకటలక్ష్మి, ఎస్సీ కాలనీ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన ఏసుపోగు రాణిలను గ్రామ పెద్దల సమక్షంలో శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా దారపనేని చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేయాలని విద్యా కమిటీలకు దిశానిర్దేశం చేశారు. తాగునీరు, అదనపు తరగతి గదులు, పారిశుధ్యం, ప్రహరీ వంటి సమస్యలను సమగ్రంగా గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ సమస్యలన్నింటినీ కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే చొరవతో తగిన నిధులు మంజూరు చేయిస్తామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో ప్రభుత్వ బడులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు అద్దంకి బాలనాగయ్య, మిరియం సుబ్బరాయుడు, చెనికల చిన్న మాలకొండయ్య, దారపనేని రాజేంద్రప్రసాద్, పామూరు సింగిల్ విండో మాజీ డైరెక్టర్ దేవరకొండ చెన్నకేశవులు, తిరివీధి ముకుందరావు, తిరివీధి చంద్ర, కల్లూరి సురేష్, తాళ్లూరి పాములయ్య, సవరం వెంగళరావు, ఏసుపోగు సురేష్ పాల్గొన్నారు. వీరితో పాటు ఇర్ల బ్రదర్స్, దేవరకొండ బ్రదర్స్, సవరం బ్రదర్స్, తాతపూడి బ్రదర్స్, దండే బ్రదర్స్ తదితరులు పాల్గొని నూతన విద్యా కమిటీ చైర్మన్లకు అభినందనలు తెలిపారు.