బాపట్లలో ‘ఫ్రెండ్లీ ఎలక్షన్స్’పై జనసేన దృష్టి!
బలమున్న చోట పోటీకి సిద్ధం.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలపై పార్టీ నేతల కసరత్తు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గంలో ‘ఫ్రెండ్లీ ఎలక్షన్స్’ విధానాన్ని అనుసరిస్తూ, తమకు బలమున్న స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల్లో ఎంపీటీసీ స్థానాలతోపాటు జెడ్పీటీసీ స్థానంపైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
బాపట్ల మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు, కర్లపాలెం మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు, పిట్టలవానిపాలెం మండలంలో రెండు ఎంపీటీసీ స్థానాలతోపాటు, పిట్టలవానిపాలెం జెడ్పీటీసీ స్థానంలో పోటీ చేయాలనే ఆలోచనలో జనసేన శ్రేణులు ఉన్నట్లు సమాచారం.
కూటమిలో స్నేహపూర్వక పోటీ విధానంలో భాగంగా స్థానికంగా పార్టీ బలాబలాలను అంచనా వేసి, గెలుపు అవకాశాలున్న చోట్ల బరిలోకి దిగాలని కార్యకర్తలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఏయే స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది? ఏ స్థానాలను కూటమి భాగస్వామ్య పక్షాలకు కేటాయిస్తారు? అన్నది పార్టీ నాయకుల చర్చలు, కూటమి నిర్ణయాలపై ఆధారపడి ఉంది.