అవనాపు కుటుంబానికి దక్కిన గౌరవం
విజయనగరం బ్యూరో : విజయనగరం జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘకాలం తర్వాత స్వర్గీయ అవనాపు సూరిబాబు కుటుంబానికి సముచిత స్థానం లభించినట్టయింది. దీంతో అధికార కూటమిలో నుంచి టీడీపీ తరుపున విజయనగరం కార్పొరేషన్ మేయర్ పీఠం సీటు ఎవరికి కేటాయించారనే ఉత్కంఠకు తెరపడింది. 2024 ఎన్నికల వేళ వైసీపీని వీడి టీడీపీలో చేరిన స్వర్గీయ అవునాపు సూరిబాబు చిన్న కుమారుడు విజయ్ సతీమణి భార్గవికి మేయర్ టికెట్ కేటాయిస్తున్నట్టు రాష్ట్ర పార్టీ అధిష్టానం శుక్రవారం రాత్రి బాగా పొద్దు పోయాక అధికారంగా ప్రకటించింది. దీంతో టీడీపీ మేయర్ టికెట్ కేటాయింపు పై నెలకొన్న సంధిగ్ధతకు ఎట్టకేలకు తెర పడింది. అవనాపు భార్గవి నీ విజయనగరం మేయర్ అభ్యర్ధి గా ప్రకటించారు. కాగా రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారు కానప్పటి నుంచి ఎవరికి వారే మేయర్ అభ్యర్థులమంటూ ప్రచారాన్ని ముమ్మరం చేసుకున్నారు.
అర్థ బలం, అంగ బలంతో పాటు, పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉన్న వారికే మేయర్ టిక్కట్ లభిస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈసారి ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో మేయర్ అభ్యర్థి పై మరింత ఫోకస్ ఎక్కువైంది. ఈ పరిస్థితుల్లోని తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థి ఎంపికపై భారీ కసరత్తు చేసింది. సమర్థుడైన అభ్యర్థిని ఎన్నికల బరిలో దించి గత అసెంబ్లీ ఎన్నికలో సాధించిన భారీ మెజార్టీని మళ్లీ ఈసారి సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఇందుకోసం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ప్రత్యేక శ్రద్ధ చూపారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రజాదరణ ఉన్న వ్యక్తిని మేయర్ అభ్యర్థిగా రంగంలోకి దించడం మంచిదని భావించి, అందరినీ ఓ తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా పార్టీ శ్రేణులన్నీ ఏకతాటిపై పనిచేసి భారీ మెజార్టీ సాధించాలన్న పట్టుదలతో పావులు కదీపారు. ఈ పరిస్థితుల్లో ఆశావహులందరినీ ఒక్కొక్కరిగా పిలిపించి వారి బలాబలాలను తెలుసుకుంన్నారు. గెలిచే అవకాశాలపై అభ్యర్థి కున్న సామర్థ్యాన్ని పరిశీలించారు. ఇందులో భాగంగానే అవనాపు శశి భార్గవి నీ ప్రాథమికంగా ఎంపిక చేశారు.
. సామాజిక వర్గాల సమీకరణలు, రాజకీయ అనుభవాన్ని రంగరించి వీరిలో అవనాపు ది తొలి నుంచి రాజకీయ నేపధ్యమున్న కుటుంబం. ఆయన తండ్రి దివంగత అవనాపు సూరిబాబు గతంలో మున్సిపల్ చైర్మన్ గా సేవలందించారు. తొలినాళ్లలో తెలుగుదేశం ఆవిర్భావం నుండి బంగ్లాలోనే అవనాపు సూరిబాబు ఉంటూ అశోక్ గజపతిరాజుకి సన్నిహితంగా మెసులుతూ వచ్చారు. ఆ తర్వాత పరిణామాలలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఆయనకు పట్టణంలో మంచిపట్టున్న నాయకుడిగా పేరుంది. ఆయన వారసుడిగా అవనాపు విజయ్ అనునిత్యం రాజకీయాలలోనే ఉంటూ యువ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన అనతి కాలంలోనే బంగ్లా వర్గాలకు దగ్గరయ్యారు. రెండు డివిజన్లలో ఆయనకు మంచి పట్టు ఉంది. అలాగే ఆర్థికంగా కూడా బలవంతుడు కావడం ఓ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో నగర ప్రజలలో ఎక్కువ ప్రాచుర్యం ఉన్న వ్యక్తికే గెలుపు అవకాశాలు ఉంటాయి. ఇది కూడా విజయ్ కి ప్లస్ అవుతుందనే చెప్పాలి. ఎందరో ఆశావహులున్నా తెలుగుదేశం పార్టీ తరఫున మేయర్ అభ్యర్థి గా అతడి భార్య భార్గవి కి ఖరారు చేశారు. ఇక స్థానిక బరిలో ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి..!