కాంగ్రెస్ పాలన రైతాంగానికి శాపం.. చల్మెడ లక్ష్మినరసింహా రావు
సూర్యవేములవాడ:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో విద్యుత్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలో కొనసాగుతున్న అప్రకటిత కరెంట్ కోతలకు నిరసనగా శనివారం వేములవాడ సబ్స్టేషన్ పరిసరాలు నిరసన జ్వాలలతో హోరెత్తాయి. నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు నాయకత్వంలో వందలాది మంది రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు భారీ ధర్నాకు దిగారు. సబ్స్టేషన్ను ముట్టడించి, రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనకారులు పెద్దపెట్టున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి చల్మెడ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగం పాలిట శాపంగా మారిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత, నాణ్యమైన విద్యుత్ను అందించి రైతన్నను రాజును చేశారు. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని దయనీయ స్థితి నెలకొంది" అని మండిపడ్డారు
.*ఎండిపోతున్న పంటలు.. పట్టించుకోని సర్కార్*
అప్రకటిత కరెంట్ కోతల కారణంగా పొలాలకు నీరందక కళ్లెదుటే పంటలు ఎండిపోతున్నాయని, పెట్టుబడులు సైతం దక్కే పరిస్థితి లేదని చల్మెడ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలు కన్నీరు పెడుతున్నా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అప్రకటిత విద్యుత్ కోతలను నిలిపివేయాలని, రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
*పోరాటాలు ఉధృతం చేస్తాం: బీఆర్ఎస్ హెచ్చరిక*
శాంతియుతంగా సాగుతున్న వ్యవసాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టేస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి వీడి రైతులకు నిరంతర విద్యుత్ అందించకుంటే, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని, ప్రభుత్వానికి పతనం తప్పదని ఈ సందర్భంగా చల్మెడ లక్ష్మీనరసింహారావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.