వినాయక్ నగర్, నేరేడ్మెట్లో వైభవంగా దేవీ శరన్నవరాత్రులు: పూజల్లో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు!
సూర్య సిటీ డెస్క్, మల్కాజిగిరి: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వినాయక్ నగర్, నేరేడ్మెట్ పరిసర ప్రాంతాలలో భక్తిశ్రద్ధలతో కొలువుదీరిన దుర్గామాత మండపాలు ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరుస్తున్నాయి. వినాయక్ నగర్లో 'జై జవాన్ యూత్ అసోసియేషన్' ఆధ్వర్యంలో, అలాగే బలరాం నగర్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ నేరేడ్మెట్లో 'ఓల్డ్ నేరేడ్మెట్ యూత్ అసోసియేషన్' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవీ మండపాలను శనివారం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మండలి చిన్నాయాదవ్, మారెడ్డి రాజశేఖర్ రెడ్డి, హేమంత్ పటేల్ తదితరులు వేర్వేరుగా దర్శించుకున్నారు.
మండపాలకు విచ్చేసిన నేతలు జగన్మాతకు నిర్వహించిన ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు, ఆశీస్సులు అందుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరిపై జగన్మాత కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా నాయకులు ప్రార్థించారు. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తున్న నిర్వాహక కమిటీ సభ్యులను, స్థానిక యువతను వారు అభినందించారు. అనంతరం దేవీ మండపాల నిర్వాహకులు బీఆర్ఎస్ నాయకులను శాలువాలతో ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.