ఆహార కల్తీపై ఉక్కుపాదం మోపాలి – ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదు: మెట్టు శ్రీధర్
పటాన్ చెరు ; ప్రతి హోటల్లో ఫిర్యాదు నంబర్లు, సమాచార కరపత్రాలు తప్పనిసరి – ప్రభుత్వం కఠిన ఉత్తర్వులు జారీ చేయాలి, ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలితెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ కేంద్రాలు, చిరుతిళ్ల దుకాణాల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్, రాష్ట్ర కార్యదర్శి డా. ఏర్పుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.ఇటీవల మెదక్ జిల్లా నర్సాపూర్లోని వన్ ప్యాలెస్ రెస్టారెంట్లో మండి బిర్యానీ తిన్న 19 ఏళ్ల సాయిరామ్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోవడం, మరో 19 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వారు పేర్కొన్నారు. ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా ఆహార భద్రత అధికారులు రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేశారు.తెలంగాణలోని ప్రతి హోటల్, రెస్టారెంట్, టిఫిన్ కేంద్రం, చిరుతిళ్ల దుకాణం, వంటకాల సరఫరా కేంద్రంలో ఆహార కల్తీపై ఫిర్యాదు చేసేందుకు అవసరమైన సహాయవాణి నంబర్లు, వాట్సాప్ నంబర్లు, ఫిర్యాదు చేసే విధానాలను తెలియజేసే సమాచార కరపత్రాలను ప్రజలకు స్పష్టంగా కనిపించే ప్రదేశాల్లో తప్పనిసరిగా ప్రదర్శించేలా ప్రభుత్వం కఠినమైన ఉత్తర్వులు జారీ చేయాలని మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు.ప్రతి హోటల్లో ఫిర్యాదు నంబర్లు, ఫిర్యాదు చేసే విధానం, సంబంధిత అధికారుల వివరాలతో కూడిన సమాచార బోర్డులు, కరపత్రాలు ఏర్పాటు చేయాలని, ఈ నిబంధనలను పాటించని యాజమాన్యాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పక్కాగా అమలయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
ఆహార కల్తీకి పాల్పడితే కఠిన శిక్షలు విధించాలి:
ఆహార కల్తీని అరికట్టేందుకు ఆహార భద్రత, ప్రమాణాల చట్టం–2006ను ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ చట్టం ప్రకారం నేర తీవ్రతను బట్టి జరిమానాలు, జైలు శిక్షలు విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.నాణ్యత లేని ఆహారం విక్రయిస్తే రూ.5 లక్షల వరకు, అపరిశుభ్ర పరిస్థితుల్లో ఆహారాన్ని తయారు చేస్తే రూ.1 లక్ష వరకు జరిమానా విధించే నిబంధనలు ఉన్నాయని తెలిపారు. కల్తీ ఆహారం తినడం వల్ల మరణం సంభవిస్తే నేర తీవ్రతను బట్టి కనీసం ఏడేళ్ల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు వరకు, కనీసం రూ.10 లక్షల జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే సంస్థలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనల ప్రకారం జరిమానాలు విధించడంతోపాటు అవసరమైన సందర్భాల్లో అనుమతులు రద్దు చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి:
కల్తీ ఆహారం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, ఆహార నాణ్యతను గుర్తించే విధానాలు, ఫిర్యాదు చేసే మార్గాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని మెట్టు శ్రీధర్ కోరారు. పాఠశాలలు, కళాశాలలు, మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టి, కల్తీ ఆహారాన్ని గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు.ప్రజలు ఆహార నాణ్యతపై ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ ఆహార భద్రత విభాగం వాట్సాప్ నంబర్ 91001 05795 ద్వారా అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు.విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, సామాన్య ప్రజలు నిత్యం హోటళ్లు, రెస్టారెంట్లలో లభించే ఆహారంపై ఆధారపడుతున్నారని, అధికారుల పర్యవేక్షణ లోపం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారకూడదని మెట్టు శ్రీధర్, డా. ఏర్పుల శ్రీనివాస్ పేర్కొన్నారు.ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. ఆహార భద్రత చట్టాన్ని కఠినంగా అమలు చేయడంతోపాటు, ప్రతి హోటల్లో ఫిర్యాదు నంబర్లు, సమాచార కరపత్రాల ఏర్పాటు తప్పనిసరి చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టి ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని వారు డిమాండ్ చేశారు.