భ్రమరాంబిక అమ్మవారు.. మహాలక్ష్మి దేవి అవతారంలో దివ్యదర్శనం
జిన్నారం, : జిన్నారం మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ మరకత జీవన జ్యోతిర్లింగ ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం భ్రమరాంబిక అమ్మవారికి ఆలయ అర్చకులు పంచామృత అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో, రంగురంగుల పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.ఈ సందర్భంగా భ్రమరాంబిక అమ్మవారు మహాలక్ష్మి దేవి అవతారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. అమ్మవారి అలంకరణ, పుష్పమాలలు, ఆభరణాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తే సుఖసంతోషాలు, ఐశ్వర్యం, సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని భక్తులు ప్రార్థించారు. భక్తి భావంతో సాగుతున్న నవరాత్రి ఉత్సవాలతో జిన్నారం ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.