పెద్దపల్లిలో వైభవంగా దసరా వేడుకలు: 35 అడుగుల రావణ దహనానికి ముస్తాబు ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు కుటుంబ సమేతంగా తరలిరావాలని ప్రజలకు ఆహ్వానం
పెద్దపల్లి, సూర్య ప్రతినిధి
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దసరా ఉత్సవాలను పెద్దపల్లి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. ఈ నెల 20వ తేదీ మంగళవారం పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న ఈ ఉత్సవాల ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, కౌన్సిలర్లు, స్థానిక నాయకులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమీక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ప్రజలందరికీ గుర్తుండిపోయేలా ఈ ప్రత్యేక వేడుకలను ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు సాంప్రదాయబద్ధంగా జమ్మి పూజ, అనంతరం సాయంత్రం 6:00 గంటలకు బాణాసంచా వెలుగుల మధ్య అట్టహాసంగా 35 అడుగుల ఎత్తైన రావణాసురుడి దహన కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. పట్టణ ప్రజలందరూ కుటుంబ సమేతంగా తరలివచ్చి ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, పట్టణ కౌన్సిలర్లు, సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ రాజశేఖర్, ఇతర ప్రజాప్రతినిధులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు