పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు సహకరించాలి
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి న్యాయవాదులు సహకరించాలని రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా సెషన్స్ జడ్జి కర్ణ కుమార్ అన్నారు. చేవెళ్ల కోర్టు ఆవరణలో అడిషనల్ కోర్టు ఛాంబర్ ను శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టుల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కోర్టు భవనం, బార్ అసోసియేషన్‌కు అవసరమైన సదుపాయాల కల్పనకు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. జిల్లా కోర్టులో లక్ష 30వేల కేసులు పెండింగ్ ఉన్నాయనని, చేవెళ్ల కోర్టుల్లో కూడా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు న్యాయవాదుల సహకారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. పెండింగ్ కేసుల తగ్గింపునకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. రాజేంద్రనగర్ జిల్లా కోర్టులో ఉన్న మొయినాబాద్‌కు సంబంధించిన కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం జరిగిందని, ఇంకా నుంచి మొయినాబాద్ కేసులు చేవెళ్ల కోర్టులోనే పరిష్కారం అవుతాయని తెలిపారు. కక్షి దారులకు సమయం వృధా కాకుండా ఉంటుందన్నారు. చేవెళ్ల కోర్టులో విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకునేలా కృషి చేయాలని సూచించారు. కోర్టు భవనం, బార్ అసోసియేషన్‌కు అవసరమైన సదుపాయాలను విడతలవారీగా అభివృద్ధి చేసుకుందామన్నారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. కేసుల సత్వర పరిష్కారానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు సమన్వయంతో పనిచేయడంతో పాటు కోర్టుకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండటం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. కోర్టు అభివృద్ధికి దాతలు ముందుకొచ్చి సహకారం అందించడం అభినందనీయమని తెలిపారు.న్యాయవ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయాలంటే మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల అదనపు జిల్లా న్యాయమూర్తి బి. శ్రీనివాసులు, సీనియర్ సివిల్ జడ్జి దశరథ రామయ్య, జూనియర్ సివిల్ జడ్జి విజయకుమార్, ఉపాధ్యాయ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. మధుసూదన్ రెడ్డి, బార్ కార్యదర్శి మల్లేష్, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మొకరం నర్సింహులు, సీనియర్ నాయవాదులు రాంరెడ్డి, గురువారెడ్డి, రఘునాథ్ రెడ్డి, సురేందర్ గౌడ్, సురేష్, ప్రకభాకర్ రెడ్డి, చంద్రశేఖర్, నారాయణ, సత్యానందం, నర్సిములు, గౌతమ్ రెడ్డి, న్యాయవాదులు తదితరులు ఉన్నారు.
(సున్నపు ప్రవీణ్ : చేవెళ్ల, మేజర్ న్యూస్ అక్టోబర్ 17)