రూ.8 లక్షల కరెన్సీ నోట్లతో గణపయ్యకు అలంకరణ
పోలిపల్లి ప్రాంతానికే వన్నెతెచ్చిన గణపతి ఉత్సవం
భోగాపురం, సెప్టెంబర్ 25, (మేజర్ న్యూస్):
భోగాపురం మండలం పోలిపల్లి గ్రామం నాయుడుగారి వీధిలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వినాయక ప్రతిమతో పాటు పరిసర ప్రాంతాన్ని సుమారు రూ.8 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో శోభాయమానంగా అలంకరించారు. వినూత్న రీతిలో చేపట్టిన ఈ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి 50 కిలోల భారీ లడ్డును ప్రసాదంగా సమర్పించారు. కరెన్సీ నోట్లతో చేసిన ప్రత్యేక అలంకరణ, భారీ లడ్డూ సమర్పణతో నాయుడోరి వీధి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గణపయ్యను దర్శించు కునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. భక్తి భావంతో పాటు వినూత్న ఆలోచనకు ప్రతీకగా ఈ ప్రత్యేక అలంకరణను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గణపతి ప్రతిమతో పాటు మొత్తం ఆవరణను కరెన్సీ నోట్లతో అలంకరించడం ద్వారా భక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగించేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వినూత్న అలంకరణ గురించి తెలుసుకున్న జిల్లా నలుమూలల నుంచి భక్తులు, ప్రజలు నాయుడోరి వీధికి తరలివచ్చి గణపయ్యను దర్శించుకుంటున్నారు. ప్రత్యేక అలంకరణను ఆసక్తిగా తిలకిస్తూ నిర్వాహక కమిటీని అభినందిస్తున్నారు.